అస్సాం రాష్ట్రంలో భారీ వరదలకు 170 మందికి పైగా మరణించగా.. దాదాపు 14 లక్షల మంది ప్రజలు ఈ ప్రళయానికి గురయ్యారు. అయితే ఆ వరదలకు కారణం ప్రకృతి విపత్తు కాదని, కృత్రిమ వరదలు అని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. అందుకు కారణమైన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాచార్ జిల్లాలోని బరాక్ నది కట్టను తెంచి తద్వారా సిల్చార్ నగరంలో వరదలు వచ్చేలా చేసిన మిథు హుస్సేన్ లస్కర్, కాబుల్ ఖాన్‌లను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కాచార్ ఎస్పీ రమణ్‌దీప్ కౌర్ స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారంలో వీరిద్దరి ప్రమేయం గురించి పూర్తి వివరాలు చెప్పేందుకు ఆమె నిరాకరించారు. ఈ కేసుపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లస్కర్‌ను శనివారం అరెస్ట్ చేసిన పోలీసులు, కాబుల్ ఖాన్‌ను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
ఈ వరదలకు మొత్తం ఆరుగురు వ్యక్తులు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ వ్యవహారంపై గువాహటిలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అదనపు డీజీపీ (సీఐడీ) నేతృత్వంలో ఈ కేసుపై పూర్తి దర్యాప్తు జరుగుతుందని, ప్రత్యేక కార్యదళం ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తుందని చెప్పారు. అయితే బరాక్ నదిలోకి నీళ్లు వెళ్లేలా చేసినట్లు పోలీసులకు మే 24నే ఫిర్యాదు అందింది. ఆ తర్వాత భారీ వర్షాల కారణంగా జూన్‌లో నది ఉప్పొంగి సిల్చార్ నగరాన్ని ముంచెత్తింది. ఈ కారణంగా దాదాపు లక్ష మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.