Assam Govt signs deal with 8 terrorist organizations
mictv telugu

తీవ్రవాదులతో అస్సాం ప్రభుత్వం ఒప్పందం.. ఒక్క హార్డ్‌కోర్డ్‌తో తప్ప

September 15, 2022

Assam Govt signs deal with 8 terrorist organizations

ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి స్థాపన కోసం గురువారం కీలక అడుగు పడింది. అక్కడ ఉన్న గిరిజన తీవ్రవాద సంస్థలతో అస్సాం ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దశాబ్దాల కాలంగా ఉన్న తీవ్రవాద సమస్యను పరిష్కరించే క్రమంలో 8 తీవ్రవాద సంస్థలతో ఈ ఒప్పందం జరిగింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మల సమక్షంలో గౌహతిలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

ఆల్ ఆదివాసీ నేషనల్ లిబరేషన్ ఆర్మీ, ఆదివాసీ కోబ్రా మిలిటెంట్, బిర్సా కమాండో ఫోర్స్, సంతాల్ టైగర్ ఫోర్స్, ఆదివాసీ పీపుల్స్ ఆర్మీలు సహా మరో మూడు తీవ్రవాద సంస్థలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని వల్ల శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయన్న ఆశాభావాన్ని హిమంత బిశ్వ శర్మ వ్యక్తం చేశారు. ఈశాన్య ప్రాంతాల అభివ‌ృద్ధికి మోదీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, దాదాపు 1100 మంది ఆదివాసీ తీవ్రవాద సభ్యులు జనజీవన స్రవంతిలో కలవడం ముఖ్య పరిణామమని అమిత్ షా అన్నారు. ఈ ప్రాంతాన్ని ఉగ్రవాద రహిత, డ్రగ్స్ రహితంగా డెవలప్ చేసే విషయంలో కేంద్రం చిత్తశుద్దితో పని చేస్తోందని అభిప్రాయపడ్డారు. కాగా, పరేష్ బారుహ్ నాయకత్వంలోని నిషేధిత ఉల్ఫాకు చెందిన కరడుగట్టిన తీవ్రవాద సంస్థ కమతాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ మాత్రం ఈ ఒప్పందంలో పాల్గొనలేదు.