‘లవ్ జిహాద్’ మోసగాళ్లపై బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం.. - MicTv.in - Telugu News
mictv telugu

‘లవ్ జిహాద్’ మోసగాళ్లపై బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం..

October 15, 2020

Assam Govt To Crackdown On 'Marriage By Deception'

గత కొన్ని రోజులుగా అసోంలో బలవంతపు మతమార్పిడి కేసులు ఎక్కువ అవుతున్నాయి. హిందూ యువతులను ముస్లిం యువత మోసం చేసి పెళ్లి చేసుకుంటుందని, బలవంతంగా మతమార్పిడి చేస్తునట్టు కొందరు తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిణామాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి అస్సోం బీజేపీ ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలో పెరుగుతోన్న లవ్ జిహాద్‌ను అడ్డుకోవడానికి ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హేమంత్‌ బిశ్వాశర్మ గువాహటిలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా అస్సోం ప్రభుత్వం పోరాటాన్ని ప్రారంభించబోతుందని మంత్రి ప్రకటించారు. 

ఈ సందర్భంగా మంత్రి హేమంత్‌ బిశ్వాశర్మ మాట్లాడుతూ..’సోషల్‌ మీడియా ద్వారా చాలామంది అమాయక అమ్మాయిలు మోసపోతున్నారు. కొంతమంది ముస్లిం యువకులు హిందు వ్యక్తి పేరుతో ఫేక్ ఎకౌంట్‌ సృష్టించి దానికి దేవుడి ఫోటోను ప్రొఫైల్ ఫోటోగా పెడుతున్నారు. తద్వారా హిందూ అమ్మాయిలను మోసం చేసి, ప్రేమ పేరుతో లోబర్చుకుంటున్నారు. తరువాత పెద్దలకు ఇష్టం లేకున్నా దొంగచాటుగా పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా ఎంతో మంది యువతులను మోసం చేశారు. లవ్‌ జిహాద్‌ పేరుతో తమ బిడ్డలను మరో వర్గం వారు బలవంతంగా వివాహం చేసుకుంటున్నారు. అమాయక యువతుల్ని మభ్యపెట్టి బలవంతంగా మత మార్పిడి చేసి.. తమ మతంలోకి మార్చుకుంటున్నారు. అలాంటి వారిపై అస్సోం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతుంది.’ అని తెలిపారు. అయితే బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు, ముస్లిం వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.