పదవ తరగతిలో అందరూ ఫెయిల్.. స్కూళ్లు మూసేయాలని ప్రభుత్వ నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

పదవ తరగతిలో అందరూ ఫెయిల్.. స్కూళ్లు మూసేయాలని ప్రభుత్వ నిర్ణయం

August 25, 2022

టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఒకరో ఇద్దరో విద్యార్థులు ఫెయిల్ అవడం చూస్తుంటాం. కానీ స్కూల్‌లో ఉన్న టెన్త్ క్లాస్ విద్యార్థులంతా ఫెయిల్ అయ్యారంటే నమ్ముతారా? అలా ఒకటి కాదు రెండు కాదు.. అసోం రాష్ట్రంలోని ఏకంగా 34 స్కూళ్లలో ఏ ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ ఫలితాలు ఆశించిన విధంగా లేకపోవడంతో…. రాష్ట్రవ్యాప్తంగా 34 పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది.

మొత్తం స్కూళ్లలో చదివిన 1,000 మంది పదో తరగతి విద్యార్థుల్లో ఒక్కరు కూడా ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదు. దీంతో విద్యా శాఖ మంత్రికి రనోజ్ పెగుకు తీవ్రంగా కోపం వచ్చింది. ఒక్కరినీ కూడా పాస్ చేయించలేని పాఠశాలల కోసం… ప్రభుత్వ సొమ్ము తగలేయడం వ్యర్థమనే అభిప్రాయానికి వచ్చారు. ‘‘పాఠశాలల ప్రాథమిక విధి విద్యను బోధించడమే. ఒక పాఠశాల తన విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విధంగా భరోసా కల్పించలేనప్పుడు అటువంటి స్కూళ్లను నిర్వహించడంలో అర్థం లేదు. అటువంటి పాఠశాలలపై ప్రభుత్వం ప్రజాధనాన్ని వెచ్చించలేదు’’అని మంత్రి పేర్కొనడం గమనార్హం.

మంత్రి ఆవేదన వెనుక పాఠశాలల్లో బోధన తీరు ఎలా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. అసోం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది పదో తరగతి పాస్ అయిన వారు 56.5 శాతంగానే ఉన్నారు. 34 పాఠశాలల్లో ఒక్కరూ పాస్ కాకపోగా, మరో 68 స్కూళ్లల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతం 10 శాతంలోపే ఉంది.