ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారని, అందుకే జనాభా పెరిగిపోతోందని అతివాద హిందూ సంఘాలు ఆరోపిస్తుంటాయి. దీనికి ముస్లిం సంఘాలు కూడా కౌంటర్లు ఇస్తుంటాయి. సున్నితమైన ఈ అంశంపై అస్సాంకు చెందిన ఓ ఎంపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హిందువులకు పిల్లలు తక్కువగా ఉండటానికి కారణాలంటూ ఆలిండియా డెమొక్రటిక్ ఫ్రంట్ చీఫ్, ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘‘ముస్లిం పురుషులు 18 నుంచి 21 ఏళ్ల మధ్య పెళ్లి చేసుకుంటారు. హిందువులు మాత్రం 40 ఏళ్లవరకు ఆ ఊసెత్తరు. వారికి చాలామందితో అక్రమ సంబంధాలు ఉంటాయి. అందుకే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు. ముస్లిం యువకులు 21 ఏళ్లకే పెళ్లి చేసుకుంటారు కాబట్టి వారికి పిల్లలు ఎక్కువ. హిందూ యువతులు 20 ఏళ్లలోపు పెళ్లాడితే పిల్లలు చాలామంది పుడతారు. హిందూ పురుషులు ముగ్గురు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు. మరి వారికి పిల్లలు ఎలా పుడతారు? హిందువులకు తక్కువ సంతానం కలగడానికి ఇదే కారణం. విత్తనాలను సారవంతమైన నేలలో నాటితేనే మంచి ఫలితాలు ఉంటాయి. అందుకే హిందువులు కూడా ముస్లింలను అనుసరించాలి’’ అని చెప్పుకొచ్చారు. బద్రుద్దీన్ వ్యాఖ్యలు చెత్తగా ఉన్నాయని, ఆయన పనికొచ్చే విషయాలు చెప్పాలని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.