అస్సాంలో పోలీసు సబ్ ఇన్స్పెక్టరు రిక్రూట్ మెంట్ పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ కేసు సంచలనం సృష్టించింది. దీని వెనక ఓ పోలీసు ఉన్నతాధికారి ఉన్నారనే సమాచారంతో విచారణ వేగవంతం చేశారు. ఎస్పీ కుమార్ సంజిత్ కృష్ణాకు సంబంధాలు ఉన్నాయని తేలడంతో అతన్ని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈయన ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజిత్ కృష్ణ సోదరుడు కూడా కావడంతో అతడి పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంలో ఇప్పటికే 50 మందిని అరెస్టు చేశారు. మాజీ డీఐజీ ప్రశాంత కుమార్ దత్తా, బీజేపీ నేత దిబాన్ దేకలపై కూడా ఆరోపణలు ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారులే చేతులు కుంభకోణానికి తెరతీయడం సంచలనం రేపింది.
597 ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది సెప్టెంబర్ 20న పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దాని కంటే ఒక రోజు ముందే చాలా మంది అభ్యర్థులు గౌహతి హోటల్లో మాక్ ఎగ్జామ్ తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 70 మంది అభ్యర్థులను ఐదు వేర్వేరు హోటళ్లలో ప్రశ్నా పత్రం లీక్ చేసి డబ్బులు తీసుకున్నట్టుగా తేలింది. దాదాపు రూ. 6 కోట్ల వరకు చేతులు మారాయని తేలింది. ఇది స్థానికంగా సంచలనం సృష్టిచడంతో సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అసోం సీఎం సర్బానంద సోనోవాల్ ఆదేశించారు.