Assam Sanskrit-speaking village in Assam
mictv telugu

తిష్ట, ఉత్తిష్ట.. ఊరంతా సంస్కృతమే మాట్లాడుతున్నారు..

October 22, 2022

Assam  Sanskrit-speaking village in Assam

‘‘తిష్ట.. ఉత్తిష్ట! గచ్చ, ఆగచ్చ! తవ నామ్ కిమ్.. కుత్ర గచ్ఛతి..’’ ఏమిటి ఈ మాటలు? ఏం భాష, ఏం ఊరు, ఏది కథ అనుకుంటున్నారు కదూ. మరేం లేదండి, ఇదంతా సంస్కృతమే. ఆ ఊళ్లోని జనం అచ్చం ఇలాగే మాట్లాడుకుంటున్నారు. కొత్తవాళ్లు బుర్రగోక్కుంటున్నా అది తమ భాష అని, అందులో మాట్లాడతామని భీష్మించారు. అందుకే వార్తల్లోకి ఎక్కడింది. అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో ఉందీ గ్రామం. పేరు పత్యాలా. ఈ ఊరిలో ఆబాలగోపాలం దేవభాషే మాట్లాడతారు. పంతులైనా, రైతులైనా, కూలీలైనా అదే భాష. బడిలో, గుడిలో, అంగడిలో, పంచాయితీ అఫీసులో ఎక్కడ చూసినా మంత్రాల్లాంటి మాటలే.

‘సంస్కృత గ్రామం’గా పేరొందిన ఈ ఊరికి చాలా కథే ఉంది. 2015లో సంస్కృత భారత ప్రచార కార్యక్రమాలు మొదలు కావడంతో అప్పట్నుంచి ఆ భాషే మాట్లాడుతున్నారు. 600 మంది జనాభా ఉన్న ఈ ఊరిలో దీపనాథ్ అనే వ్యక్తి యోగాలో శిక్షణ కూడా ఇస్తున్నాడు. ప్రతినెల జరిగే గాయత్రి యజ్ఞంలో ఊరంతా పాల్గొంటుంది. పత్యాలా చూసి పక్కనే ఉన్న అనిపూర్ పల్లె ప్రజలూ అదే మాట్లాడుతున్నారు. సంస్కృతం మాట్లాడే గ్రామాలు మన దేశంలో మరికొన్ని ఉన్నాయి. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా మత్తూరులోనే జనం దేవభాషే మాట్లాడతారు. 5వేల మంది ఉన్న ఈ ఊరి పాఠశాల సిలబస్‌లో సంస్కృతం తప్పనిసరి. ఇది చాలా పురాతన గ్రామం. శ్రీకృష్ణ దేవరాయలు ఈ గ్రామాన్ని దానం చేశాడని చరిత్ర.