త్రిపురలో బీజేపీ ఎలా గెలిచింది? ఓ విశ్లేషణ - MicTv.in - Telugu News
mictv telugu

త్రిపురలో బీజేపీ ఎలా గెలిచింది? ఓ విశ్లేషణ

March 3, 2018

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం రాజకీయ పరిశీలకులను కూడా నివ్వెరపరుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కసీటు కూడా దక్కించుకోలేక చతికిలబడిన కమలనాథులు ఈసారి అనూహ్యంగా నాలుగింట మూడు వంతుల సీట్లు.. అంటే దాదాపు 42 సీట్లును ఎల్లా కొల్లగొట్టారు? గత ఎన్నికల్లో పట్టుమని రెండు శాతం ఓట్లు కూడా సాధించలేని కాషాయదళం ఐదేళ్లలో ఏం మంత్రం వేసి ఈ ఘనత సాధించింది? పాతికేళ్ల సీపీఎం అప్రతిహత పాలనకు ఎలా అడ్డుకట్టవేయగలిగింది?చిన్నపామునైనా పెద్ద కర్రతో..

ఇన్ని ప్రశ్నలకు ఒకటే జవాబు చెప్పడం సాధ్యం కాదు. సీపీఎం వైఫల్యాలు, బీజేపీ వ్యూహాలు, ప్రజల ఆలోచనా తీరును విశ్లేషించాల్సి ఉంటుంది. కేవలం సిద్ధాంతబలం తప్పిస్తే ప్రజాసమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి లేకపోవడం, పెచ్చరిల్లిన నిరుద్యోగం, అవినీతి, ప్రభుత్వంపై వ్యతిరేకత.. ఇవన్నీ కామ్రేడ్ల పతనానికి దారితీశాయి.

అదే సమయంలో పకడ్బందీ వ్యూహం, కేంద్రంలో అధికారంలో ఉండడంతో అందివచ్చిన కొన్ని సౌలభ్యాలు, ఎన్నికల్లో తాయిలాలు, పనిచేసిన, పనిచేయకపోయినా మోదీ అభివృద్ధి మంత్రం, ప్రచార ఆర్భాటం బీజేపీ గెలుపుకు బాటలు పరిచాయి. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న నానుడి ప్రకారం బీజేపీ తన శాయశక్తులనూ ఒడ్డి విక్టరీ కొట్టింది. పట్టుమని పాతిక లక్షల మంది ఓటర్లు లేని రాష్ట్రంలో ఏకంగా ప్రధాని మోదీ వచ్చి ఎన్నికల ప్రచారం చేశారంటే బీజేపీ ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టకు తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. త్రిపురతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లోనూ మోదీ విస్తృతంగా పర్యటించడం, ఆ ప్రాంతానికి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని విమర్శలు గుప్పించడం పనిచేసినట్లే కనిపిస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ అధినేత అమిత్ షా తదితర దిగ్గజాలు కూడా త్రిపురలో సుడిగాలి పర్యటన చేసి బీజేపీ గొంతను బలంగా వినిపించారు.

ఆయన మంచోడే.. కానీ, కామ్రేడ్ల స్వయంకృత అపరాధాలు..20 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్న మాణిక్ సర్కార్ నీతినిజాయితీలకు పెట్టింది పేరు. దేశంలో అత్యంత పేద సీఎం ఆయనే. ఈ కీర్తితోపాటు, రాష్ట్రంలో మరే పార్టీ కూడా బలంగా లేకపోవడంతో సీపీఎం అలవోకగా గెలుస్తూ వస్తోంది. అయితే పాతికేళ్ల వామపక్ష పాలనతో ప్రజలు విసుగెత్తారు. మాణిక్ మంచివాడే కానీ, పాలన అడ్డదిడ్డంగా తయారైంది. కమ్యూనిస్టు నేతలు లంచాలు మరిగారని ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా పని జరగాలంటే ప్రభుత్వ కార్యాలయంలో కాకుండా  సీపీఎం కార్యాలయాల్లో లంచాలు ముట్టజెబితే చాలు అన్నస్థాయికి పార్టీ పతనమైంది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాకపోవడం, వ్యవసాయంలో సంక్షోభం తదితర కారణాలతో నిరుద్యోగం పెరిగింది. అందరికీ పని కల్పిస్తామన్న కమ్యూనిస్టు పార్టీ పాలిత రాష్ట్రంలో నిరుద్యోగం ఏకంగా 25 శాతానికి పెచ్చరిల్లింది. పెద్ద సంఖ్యలో యువత పొట్టకూటి కోసం కర్ణాటక, తమిళనాడు వంటి దూరప్రాంతాలకు వలస వెళ్లున్నారు. జాతివివక్ష దాడులకు గురవుతున్నారు. మరోపక్క త్రిపురలోనూ గిరిజనులపై దాడులు కూడా పెరిగాయి. ఈ పరిస్థితిని కామ్రేడ్లు ఎప్పటికప్పుడు పసిగట్టడంతో దారుణంగా విఫలమయ్యారు. మూస, ప్రగతి మందగించిన పాలన కాకుండా ప్రధాని మోదీ చెబుతున్న అభివృద్ధి, అచ్చేదిన్, డిజిటల్ ఇండియా వంటి కలల ప్రపంచంపై జనం ఆకర్షితులయ్యారు.

పొత్తులు, తాయిలాలు.. బీజేపీ మంత్రాలు

అస్సాంలో బోణీ కొట్టాక బీజేపీ ఎలాగైనాసరే మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి పకడ్బందీగా వ్యూహాలు పన్నింది. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ర్టాల్లో ఆయారాం గయారాం, సిద్ధాంతాలను పట్టించుకోకుండా నానా పార్టీలతో అవకాశవాద పొత్తులు వంటి మరెన్నో వ్యూహాలతో జెండాలను పాతేసింది. త్రిపురను కూడా అలాగే కొల్లగట్టడానికి ప్రణాళికలు వేసింది. అందుకు కావలసి ధనబలం, కేంద్రం నుంచి అందాల్సిన సాయాలు బీజేపీకి సానుకూలించాయి. ఎంత జాతీయ పార్టీ అయినా స్థానిక అంశాలే బలమని బీజేపీ గ్రహించింది. ఇండీజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్‌టీ)తో పొత్తుపెట్టుకుంది. మరిన్ని స్థానిక అతివాద సంస్థలతో ప్రత్యక్ష, పరోక్ష అవగాహన కుదుర్చుకుంది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే 3.3 లక్షల మంది పేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ నెరవేరితే రాష్ట్ర జనాభా 25 లక్షల మంది ఓటర్లలో సగం మందికి ప్రయోజనం కలుగుతుంది. ఇది మహిళా ఓటర్లను కమలంవైపు మళ్లించింది. పాతికేళ్లుగా అధికారంలో ఉన్న సీపీఎం.. వంటగ్యాస్ మాత్రమే కాకుండా రేషన్, పారిశుద్ధ్యం వంటి కనీస అవసరాలను తీర్చడంతో వైఫల్యం కావడం బీజేపీకి కలసొచ్చింది.ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించడానికి  అస్సాం ఆరోగ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన కృషి కూడా కీలకం. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన శర్మకు ‘ఈశాన్య’ సెంటిమెంట్లు బాగా తెలుసు. అందుకే బీజేపీ ఆయనను త్రిపుర బీజేపీ ఎన్నికల ఇంచార్జ్‌గా బాధ్యతలు కట్టబెట్టింది. శర్మ.. స్థానిక గిరిజన తెగల నాయకులతో సంబంధాలు నెరిపి, లోకల్ ఓటు బ్యాంకులను బీజేపీవైపు మళ్లించాడు. అలాగే తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్‌ల నుంచి అసంతృప్తులను ఆహ్వానించి పార్టీని పటిష్టం చేశారు. ఆరెస్సెస్ నేత సునీల్ దియోద‌ర్ కృషి కూడా తక్కువేమీ కాదంటున్నారు. సంఘ్ కార్యకర్తలను ఆయన క్షేత్రస్థాయికి పంపి బీజేపీ భావజాలాన్ని ప్రచారం చేశారు.

ఈవీఎంల ట్యాంపరింగ్..!

గత ఎన్నికల్లో ఒక్క సీటూ సాధించని బీజేపీ అనూహ్యంగా 40కిపైగా స్థానాలను చేజిక్కించుకుందటే నమ్మశక్యం కాదన్న భావన ఈవీఎంలపై వేలెత్తి చూపుతున్నాయి. బీజేపీ యూపీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించినప్పటి నుంచే వీటి విశ్వసనీయత ప్రశ్నార్థకం అవుతూ వస్తోంది. మొన్నటి గుజరాత్ ఎన్నికల్లోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని నిర్ధారించడం అంత సులభం కాదు కనుక ఏమీ చెప్పలేం. ఈవీఎంల ట్యాంపరింగ్ అంత సులభ సాధ్యం కాదని చెబుతున్నా, చాలా ఫలితాల్లో ఈవీఎంలలో వేసిన ఓట్లన్నీ బీజేపీ పడ్డాయన్న ఆరోపణలను అంత తేలిగ్గా తీసుకోలేం.

లెఫ్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకం   

పశ్చిమ బెంగాల్లో దెబ్బతిన్నాక త్రిపుర, కేరళలపై లెఫ్టిస్టులు ఆశలు పెట్టుకన్నారు. కేరళలో కాస్త నిలబడినా త్రిపుర తమ చేతుల్లోంచి వెళ్లిపోవడం వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. సమీప భవిష్యత్తులో సీపీఎం మళ్లీ ఎక్కడా అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అదే నిజమైతే పార్లమెంటులోనూ ఆ పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థంగా మారిపోతుంది.