ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం దిశగా అడుగులేస్తోంది. త్రిపుర, నాగాలాండ్‌లో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇక మేఘాలయలో సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది. త్రిపుర, నాగాలాండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే బీజేపీ పూర్తి ఆధిక్యం కనబరిచింది. దీంతో, రెండు రాష్ట్రాల్లో భారీ వికర్టీని అందుకుంది. త్రిపురలో 60 స్థానాలకు గానూ దాదాపు 33 స్థానాల్లో బీజేపీలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేయడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక, కాంగ్రెస్, లెప్ట్ కూటమి 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టిప్రా 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. 60 స్థానాలకు గానూ బీజేపీ కూటమి దాదాపు 36 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేయడంతో కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు ఖాయమైంది. దీంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. మరోవైపు.. మేఘాలయలో ఫలితాలు హంగ్ దిశగా వెళ్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. సీఎం కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ 22 స్థానాల్లో ఆధిక్యంగా ఉంది.