ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మూడు రాష్ట్రాల్లో మొత్తం 180 సీట్లకు ఎన్నికలు జరగ్గా కౌంటింగ్ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటివరకూ నమోదైన ఫలితాల ప్రకారం నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమి హవా కొనసాగుతోంది. బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమి 40 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్‌పీఎఫ్ 3, కాంగ్రెస్ , ఎన్‌పీపీ , ఇతరులు ఇంకా బోణీ కొట్టలేదు. నాగాలాండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 31 స్థానాలు అవసరం.
త్రిపురలో ప్రస్తుతం బీజేపీ కూటమి 34 చోట్ల, కాంగ్రెస్-వామపక్షాల కూటమి 14 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. త్రిపురాధీశుడు ప్రద్యోత్‌దేవ్ వర్మకు చెందిన తిప్రా మోథా పార్టీ (టీఎంపీ) 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మెజార్టీ మార్క్ 31. త్రిపుర సీఎం మాణిక్ సాహా బోర్దోవలి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. సీపీఎంకు చెందిన సమీప ప్రత్యర్థి ఆశిష్‌కుమార్ సాహాపై ఆయన జయకేతనం ఎగురవేశారు. ఇక చారిలమ్ స్థానంలో ఉపముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ 1000 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ తిప్రా మోథా అభ్యర్థి సుబోధ్ దేవ్ వర్మ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మేఘాలయలో అధికార ఎన్‌పీపీ (NPP) ముందంజలో ఉంది. మొత్తం 60 సీట్లలో ఎన్‌పీపీ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ 5 స్థానాల్లో ఉంది. ఫలితాలు హంగ్ అసెంబ్లీని సూచిస్తుండటంతో బీజేపీతో జట్టు కడతామని అధికార ఎన్‌పీపీ ఎంపీ వన్వీరోయ్ ఖర్లుఖి సంకేతాలిస్తున్నారు. ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, ఇది బీజేపీ, ఎన్‌పీపీ కూటమికి లభించిన ప్రజా తీర్పు అని, మేఘాలయలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే సంకేతాలను పంపించారు.