నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..చర్చించనున్న అంశాలు ఇవే..
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 11.30 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే, ఇటీవలే మరణించిన మాజీ శాసన సభ్యులకు సభ సంతాపం ప్రకటించనుంది. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్ధన్‌కు సంతాపం తెలిపిన తర్వాత సభ వాయిదా పడనుంది.
ఇక, సమావేశాల విషయానికొస్తే.. ఎన్ని రోజులు ఈ సమావేశాలు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? ఏఏ తీర్మాణాలు సభలో ప్రవేశపెట్టాలి? అనే తదితర విషయాలపై బీఏసీలో నిర్ణయించనున్నారు. తాజా సమాచారం ప్రకారం..ఈ నెల 12, 13, 14 తేదీల్లో అసెంబ్లీ కొనసాగే అవకాశముంది.
ఇదివరకే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రాత్సోవాల సందర్భంగా ఈ నెల 16, 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి కొనసాగింపుగా శాసన మండలి, శాసనసభల్లో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత దళిత బంధును ప్రస్తుతం నియోజకవర్గాలవారీగా అందచేస్తున్న 100 కుటుంబాలకు అదనంగా మరో 500 మందికి ఈ పథకాన్ని విస్తరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై కూడా సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశాలున్నాయిన్నట్లు సమాచారం.
మరోపక్క శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలు సమావేశాలు సజావుగా సాగేలా, పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని సోమవారం వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. గతంలో ఏవిధంగానైతే అసెంబ్లీ సమావేశాలు జరిగాయో, ఈ సమావేశాలు కూడా అలాగే జరగాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.