కోమటిరెడ్డి, సంపత్ అసెంబ్లీ సభ్యత్వాలు రద్దు - MicTv.in - Telugu News
mictv telugu

కోమటిరెడ్డి, సంపత్ అసెంబ్లీ సభ్యత్వాలు రద్దు

March 13, 2018

గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ నానా అల్లరి చేసిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూల్యం చెల్లించుకున్నారు. హెడ్ ఫోన్స్‌ను విసిరేయడంపై అసెంబ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌ల శాసన సభ్యత్వాలను రద్దు చేసింది. ఈమేరకు మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఈ శిక్ష చాలా చిన్నదేనని వ్యాఖ్యానించింది.నిరసన తెలిపిన ఇతర కాంగ్రెస్ సభ్యులపైనా సభ చర్యలు తీసుకుంది. తాజా బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, పద్మావతిరెడ్డి,  మాధవరెడ్డి, డీకే అరుణ, భట్టి విక్రమార్క, రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డిలను సస్పెండ్ చేసింది.  

ఈ ఇద్దరు ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించి, సభ మర్యాదను మంటగలిపారని స్పీకర్ మధుసూదనాచారి ఆక్షేపించారు. తాను వీడియో క్లిప్పింగ్స్ అన్నీ చూశానని, ఉద్దేశపూర్వకంగా కొందరు సభ్యులు ఇలా చేశారని తెలిపారు. రాష్ట్రం వచ్చాక నాలుగేళ్లలో ఇలా ఎన్నడూ జరగలేదని, వారు తక్షణమే సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. లేకపోతే మార్షల్స్ ను పిలిపించి బయటికి వెళ్లగొడతామని హెచ్చరించారు. తామెంతో మనోవేదన అనుభవిస్తున్నామన్నారు.