కాకినాడ నగరంతో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఫైన్ కట్టమన్న పాపానికి అధికారిపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి .ఈ దాడిలో సదరు అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. అందరూ చూస్తుండగానే ఘటన జరిగినా ఎవరూ అడ్డుకోవడానికి ముందుకు రాకపోవడం కలకలం రేపుతోంది.
పూర్తి వివరాలు చూస్తే.. కాకినాడ నగరంలోని జిల్లా పరిషత్ సెంటర్ వద్ద అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.చిన్నారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యాన్‌పై కొబ్బరిబొండాలు అమ్మే వ్యక్తి దుర్గాప్రసాద్‌ని వాహన రికార్డులు చూపించమని కోరారు. వ్యాన్ ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ వివరాలపై ఆరా తీసి..ఫైన్ విధించారు. దీనిపై ఆ వ్యక్తికి, అధికారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇటీవలే జరిమాన కట్టానంటూ కొబ్బరిబొండాలు అమ్మే వ్యక్తి వెహికల్ ఇన్స్పెక్టర్‌పై ఎదురుతిరిగాడు. ఘర్షణ తీవ్రం కావడంతో ఆవేశానికి లోనైన దుర్గాప్రసాద్.. కొబ్బరి బోండాల కత్తితో అసిస్టెంట్ మోటర్ ఇన్స్పెక్టర్ చిన్నారావును కత్తితో విచక్షణా రహితంగా దాడిచేశాడు. అందరూ చూస్తుండగానే నరికేశాడు.
ఈ సమయంలో ఎవరూ అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అధికారిని ఆస్ప్రతికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.