అసోంలో వేలమంది పురుషులకు ముప్పొచ్చిపడింది. ముఖ్యంగా బాలికలను వివాహం చేసుకున్నవాళ్లకు దిక్కుతోచడం లేదు. సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన హెచ్చరికే దీనికి కారణం. పద్దెమిదేళ్లలోపు బాలికలను పెళ్లిచేసుకున్న వేలమంది భర్తలను త్వరలో అరెస్ట్ చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. పద్నాలుగేళ్ల లోపు వయసున్న ఆడపిల్లలను పెళ్లాడిన వారిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టి జీవితఖైదు విధిస్తామన్నారు. ‘‘ఆడపిల్లల పెళ్లిళ్లు, గర్భధారణ వంటి విషయాల్లో ఇంకా కొన్ని దురాచారాలు కొనసాగుతున్నాయి. వాటికి
పాల్పడేవారికి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఐదారు నెలల్లోనే వేలాది మంది భర్తలను అరెస్ట్ చేస్తాం’’ అని ఆయన చెప్పారు.
బాలికతో లైంగిక సంబంధం పెట్టుకునే భర్తలు కూడా నేరస్థులేనని, అది అత్యాచారమేనని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా సరైన వయసులో పెళ్లి చేసుకోవాలని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. ‘‘చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం ఎంత తప్పో వయసు మీరిపోయినా పెళ్లి చేసుకోకపోవడం అంతే తప్పు. మాతృత్వానికి 22-30 మధ్య వయసు బావుంటుంది. ఆడవాళ్లు ఆ వయసు మీరక ముందే పెళ్లి చేసుకోవాలి’’ అని చెప్పారు.