astrologers says team india will won in finals through a media channel
mictv telugu

జ్యోతిష్యాన్ని జోక్‌గా మార్చిన మీడియా

November 13, 2022

జ్యోతిష్యం – క్రికెట్.. ఈ రెండూ కూడా ఒకదానికొకటి ఎటువంటి సంబంధంలేని రంగాలు. దేశవిదేశాల్లో క్రికెట్ కోసం పడిచచ్చే అభిమానులుండగా.. జ్యోతిష్యం అనేది మూఢనమ్మకం అని కొట్టిపారేసే వారు ఎంతోమంది. ప్రస్తుతం ఈ రెండింటికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటి? ఈ రెండూ ఎలా జతకడతాయని అనుకునేవారికి ఇదొక మంచి టైమ్ పాస్ న్యూస్. రెండ్రోజుల క్రితం ఓ న్యూస్ ఛానల్లో(హిందీ) క్రికెట్ పై జ్యోతిష్యులతో ఓ లైవ్ ప్రొగ్రామ్ జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో భారత్ గెలుస్తుందా లేదా అనేది ఆ ప్రొగ్రామ్ మెయిన్ కార్యక్రమం టాపిక్. పది మందికి పైగా జ్యోతిష్యులు పాల్గొన్న ఆ ప్రొగ్రామ్ లో.. వారంతా చెప్పింది ఒక్కటే. తప్పకుండా ఇండియా టీ20 ప్రపంచ కప్ గెలిచితీరుతుంది.

ఈ మాటే మాట్లాడారు చివరిదాకా. కుంభ లగ్నం, మకర లగ్నం, రాహువు, కేతువు, శని, శుక్రుడు, సూర్యుడు… అబ్బో ఒకటేమిటీ.. రాశులు, నక్షత్రాలు ఆటగాళ్ల కదలికల పై ఆధారపడి ఉంటాయని.. సెమీ ఫైనల్స్ లోనే కాదు. ఫైనల్స్ లోనూ ఇండియా టీం గెలుస్తుందని, ఈ సారి ప్రపంచ కప్ మనదే అని కుండబ‌ద్దలు కొట్టి మరీ చెప్పారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అత్యంత కాన్ఫిడెంట్ గా ఈ విషయం చెప్పారు. వీళ్ళ వాదనల తర్వాత వచ్చిన ఫలితం ఏంటంటే, ఇండియా సెమీ ఫైనల్ లోనే ఓడిపోయింది. ఇప్పుడు ఆ ప్రొగ్రాం సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. మారుతున్న కాలంలో అభివృద్ధితో పాటు సమస్యలు కూడా పెరుగుతుండడం.. జనాలు ఈ జ్యోతిష్యంపై ఆధారపడడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ప్రజల బలహీనత ఆసరా చేసుకొని ఇటువంటి జ్యోతిష్యులు మీడియా ద్వారా వారిని పిచ్చోళ్లని చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఇప్పటికే జ్యోతిష్యంపై ఎన్నో విమర్శలున్నాయి. తాజాగా జరిగిన ఈ లైవ్ ప్రొగ్రాం ఆ విమర్శలకు మరింత ఆజ్యం పోసినట్లయిందంటున్నారు కొంతమంది. ప్రస్తుత రోజుల్లో ఏ ఛానల్ లో చూసినా ప్రతీరోజూ పొద్దున్నే తప్పకుండా జ్యోతిష్యం, రుద్రాక్ష, రంగురాళ్ళు, పాచికలు, తాటాకు గ్రంథాలు.. వంటి ప్రోగ్రాంలు ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నాయని అంటున్నారు. అయినా రెండు దేశాల మధ్య జరిగే, జరుగుతున్న ఆటను దేశభక్తి అని ఎలా చెప్పుకుంటారని మీడియాను ఎండగడుతున్నారు. దేశభక్తిని జ్యోతిష్యానికి జత చేసి, వాటిని టీవీ ఛానెళ్లలో ప్రసారం చేయడం మీడియాకు ఎంతవరకూ కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా, వారి ఎమోషన్స్‌తో ఆడుకుంటున్న ఇలాంటి ఛానెళ్లని బైకాట్ చేయాల్సిందేనంటున్నారు.