రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతీ ఏటా రాజ్ భవన్(Raj Bhavan)లో గవర్నర్ నేతృత్వంలో నిర్వహించే ఎట్ హోం కార్యక్రమం.. ఈసారి కూడా సందడిగానే జరిగింది. కాకపోతే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫు నుంచి ఒక్కరు కూడా హాజరుకాలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాత్రమే హాజరయ్యారు. ముగ్గురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు ఉన్న బీజేపీలో.. బండి సంజయ్(Bandi Sanjay) మాత్రమే హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇక గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆహ్వానం మేరకు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలపై ఇవాళ జరిగిన విషయాలన్నీ అందరికి తెలుసని.. దీనిపై కేంద్రానికి నివేదిక పంపినట్లు గవర్నర్ తెలిపారు.
అధికార బీఆర్ఎస్ (BRS)తో పాటు కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు ఎవరూ ఎట్ హోం(At Home) కార్యక్రమానికి హాజరు కాలేదు. రాజకీయ పార్టీల నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ నేతలు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు హాజరయ్యారు.
మరోవైపు నిన్న ఉదయం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా బీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వ పెద్దలూ ఎవరూ హాజరుకాలేదు. సీఎస్, డీజీపీ మాత్రమే హాజరయ్యారు. ఉదయం తన ప్రసంగంలో కేసీఆర్(CM KCR) సర్కారు తీరుపై గవర్నర్ పరోక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.