మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మూడు బస్సులపైకి ట్రక్కు దూసుకొచ్చింది. దీంతో ప్రయాణికులతో ఉన్న ఓ బస్సు.. లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. ప్రయాణికులు సత్నాలో జరిగిన కోల్ మహాకుంభ్ ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వస్తుండగా రేవా-సత్నా సరిహద్దులోని బర్ఖదా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. భోజనం కోసం రోడ్డు పక్కన బస్సులు ఆపగా..అంతలోనే ఘోరం జరిగిపోయింది.
సిమెంట్ లోడుతో వెళ్తున్న ట్రక్కు టైరు పేలిపోవడంతోనే ఓ ట్రక్కు వేగంగా వచ్చి బస్సులను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం సివరాజ్ సింగ్ చౌహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. రేవా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి చేరుకొని చికిత్స పొందుతున్నవారిని పరామర్శించి ధైర్యం చెప్పారు.