నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో రన్‌వేపై విమానం కుప్పకూలిపోయింది. ఇక, విమానం ఖాట్మాండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయల్దేరిన యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్ 72 విమానం కుప్పకూలింది. కాగా, విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది కలిపి మొత్తం 72 మంది ఉన్నట్టు తెలుస్తోంది. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం, పాత విమానాశ్రయం మధ్య చోటు చేసుకొంది. ఈ విషయాన్ని యతి ఎయిర్‌లైన్స్ సిబ్బంది సుదర్శన్ బర్తౌలా ధ్రువీకరించారు.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 30 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తెక్ బహదూర్ కేసీ స్థానిక పత్రికలకు వెల్లడించారు. ఈ విమానంలోని వారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువని ఆయన వ్యాఖ్యానించారు. విమాన ప్రమాదం జరిగిన చోట భారీగా మంటలు చెలరేగడంతో భద్రతా సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన కారణంగా పోఖారా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. ప్రయాణికుల పరిస్థితేంటి? విమానం ఎందుకు కూలింది? సాంకేతిక లోపమా? లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ప్రయాణికుల్లో పది మంది భారతీయులు కూడా ఉన్నారని తెలుస్తోంది.