పిల్లలకు కొత్త కొత్త పేర్లు పెట్టడం మామూలే. కానీ అట్లాంటాకి చెందిన ఒకామె మెక్ డీలోనే డెలివరీ అయింది. అందుకే తనకి పుట్టిన పాపకి ‘లిటిల్ నగ్గెట్’ అని నామకరణం చేసింది.
అట్లాంటాకి చెందిన అలండ్రియా వర్తీ తన కాబోయే భర్తతో కలిసి చెకప్ చేయించుకోవడానికి హాస్పిటల్కి బయలుదేరింది. ఆకలి అనిపించింది. ఆమెకు మెక్ డీ అంటే ఇష్టం. ఈలోపు మెక్ డీ కనపడడంతో అందులోకి వెళ్లారు. ఆర్డర్ కూడా పెట్టారు. ఆర్డర్ వచ్చేలోపు వాష్రూమ్ వచ్చినట్టు అనిపిస్తే బాత్రూమ్లోకి వెళ్లింది.
‘నేను బాత్రూంలోకి వెళ్లాను. వెంటనే ఉమ్మనీరు పడిపోయింది. భయంతో అక్కడే పడిపోయాను. అప్పుడు ఫాస్ట్ఫుడ్ పాయింట్ జనరల్ మేనేజర్ ట్యునీషియా వుడ్ వార్డ్ నాకు డెలివరీ చేయడానికి సహాయం చేశారు’ అన్నది వర్తీ. ‘అందరూ తమాషా చేస్తున్నారని అనుకున్నా. నేను తలుపు తెరవగానే ఎవరినీ చూడలేదు. కేవలం ఆమె పాదాలు చూశాను’ అని వుడ్ వార్డ్ అన్నాడు. అతనితో పాటు ఇద్దరు సహచరులు కూడా అత్యవసర డెలివరీలో సహాయం చేశారు.
వర్తీ కాబోయే భర్త డెలివరీ అయ్యేంత సేపు వచ్చి మానసికంగా మద్దతు ఇచ్చాడు.‘నేను ఊపిరి పీల్చుకున్నా. ముందు ఆమెను ప్రశాంతంగా ఉండమని చెప్పాను. మెక్డొనాల్డ్స్లోని ఆడవాళ్లను ముందు వైపు, ఆమె చేతులు పట్టుకున్నారు. ఆమె పాదాలను నా మోకాళ్ల వైపు ఉంచాను. మూడుసార్లు పుష్ చేయమని చెప్పా. పావుగంట తర్వాత పండంటి ఆడపిల్ల పుట్టింది. అందరూ ‘లిటిల్ నగెట్’ అని ముద్దుగా పేరు పెట్టారు’ అన్నాడు వుడ్ వార్డ్. వర్తీకి కూడా ఆ పేరు బాగా నచ్చింది. ‘నా తల్లిదండ్రులకు కూడా పేరు నచ్చింది. లిటిల్ నగెట్ అనే పేరు ఆమెకు సరిగ్గా సరిపోతుంది’ వర్తీకి కాబోయే భర్త ఫిలిప్స్ చెప్పాడు. ‘ఇంత త్వరగా డెలివరీ అవుతుందని మేం ఊహించలేదు. ఈ అనుభవం చాలా కొత్తగా ఉంది’ అని వర్తీ అంటున్నది. మరి వర్తీ పాప పేరు మీకూ నచ్చిందా?