ATM cash vehicle driver flees with Rs.31 lakh in Hyderabad
mictv telugu

బ్యాంక్ సిబ్బందిని బురిడీ కొట్టించిన డ్రైవర్

November 4, 2022

ATM cash vehicle driver flees with Rs.31 lakh in Hyderabad

ఏటీఎంలో డబ్బులు జమ చేసేందుకు వచ్చిన బ్యాంక్ సిబ్బందినే బురిడీ కొట్టించి , డబ్బులతో ఉడాయించాడు ఆ డ్రైవర్. దాదాపు రూ.30 లక్షలపైగా ఉన్న ఆ వ్యాన్‌ నుంచి బ్యాంక్‌ సిబ్బంది దిగగానే అక్కడ నుంచి వ్యాన్‌తోనే జారుకున్నాడు. ముందు జాగ్రత్తగా వ్యాన్ కు సంబంధించిన జీపీఆర్ఎస్‌ను సైతం స్విచ్ ఆఫ్ చేసి ఉంచడం విశేషం. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రాజేంద్రనగర్‌ డిటెక్టివ్‌ ఇన్స్‌పెక్టర్‌ పవన్‌ తెలిపిన వివరాల మేరకు.. గురువారం సాయంత్రం రాజేంద్రనగర్‌ కెనరా బ్యాంక్‌ ఎటీఎంకు ఉద్యోగులు అశోక్‌, భాస్కర్‌, కేవీ రమణ, చంద్రయ్యతో పాటు వాహన డ్రైవర్‌ బోరబండకు చెందిన ఫారూఖ్‌(25) రూ.31లక్షల నగదు తీసుకొచ్చారు.

ఉద్యోగులు ఏటీఎంలోకి వెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కడే ఉన్న డ్రైవర్‌ వ్యాన్‌తో పరారయ్యాడు. కొద్దిసేపటికి ఏటీఎం నుంచి బయటకు వచ్చిన గన్‌మెన్‌ చంద్రయ్య.. వ్యాన్ కనిపించకపోవడంతో లోపల ఉన్నవారికి సమాచారం ఇచ్చాడు. చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారైన ఫారుఖ్‌ వ్యాన్‌ను కిస్మత్‌పూర్‌ బ్రిడ్జి వద్ద నిలిపేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి తనిఖీ చేసి రూ.3లక్షలతో డ్రైవర్‌ పరారైనట్లు గుర్తించారు. మిగిలిన రూ.28లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.