చెర్నోబిల్ ‘అణు’ వోడ్కా.. తాగే దమ్ముందా? - MicTv.in - Telugu News
mictv telugu

చెర్నోబిల్ ‘అణు’ వోడ్కా.. తాగే దమ్ముందా?

August 9, 2019

రష్యాలోని చెర్నోబిల్ ప్రాంతంలో 1986 ఏప్రిల్ 26 అర్ధరాత్రి జరిగిన అణు విధ్వంసం దాదాపు 30 మందిని పొట్టనపెట్టుకుంది. ఈ అణు ప్రమాదం మొత్తం ప్రపంచాన్ని వణికించింది. ఈ సంఘటన తరువాత చాలా దేశాలు అణుపరిశోధనలకు బ్రేకులు వేసాయి. ప్రమాదం ధాటికి చెర్నోబిల్‌ పట్టణమంతా నిర్మానుష్యం మారింది. అణుధార్మిక శక్తి కారణంగా మనుషులు అనారోగ్యానికి గురవుతారని గ్రహించిన రష్యా ప్రభుతం చెర్నోబిల్ పట్టణాన్ని కొన్ని రోజుల వ్యవధిలోనే ఖాళీ చేయించింది. దీంతో దాదాపు 350000 మంది ప్రజలు వేరే పట్టణాలకు వలస వెళ్లారు. ఆ ప్రాంతంలో అణు ధార్మికత ప్రభావం 24000 సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో చెర్నోబిల్ ప్రాంతం శాశ్వతంగా మూత పడిపోయింది.

కొన్ని వేల హెక్టార్ల సాగు భూమి నిస్సారం అయిపోయింది. కానీ ఆ భూమిని ఎలాగైనా వాడుకోవాలని,  పూర్వవైభవం తీసుకొని రావాలని కొందరు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నలుగురు బ్రిటిష్ శాస్త్రవేత్తలు మద్యం తయారీకి  పూనుకున్నారు.చెర్నోబిల్ ప్రాంతంలో పండిన బార్లీ గింజలతో వోడ్కా తయారు చేశారు. దానికి ‘అటామిక్’ అని నామకరణం చేశారు. ఆ గింజలలో అణుధార్మిక శక్తి లేదని.. సాధారణ వోడ్కా మాదిరే ఉందని వారు చెబుతున్నారు. నిర్వీర్యంగా మారిన చెర్నోబిల్ ప్రాంతానికి మళ్లీ పూర్వవైభవం తీసుకొని వచ్చి ఇక్కడి ప్రజల్లో మార్పు తీసుకొని రావడానికే ఈ ప్రయోగం చేశామని శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన స్మిత్ మీడియాకు తెలిపారు. చెర్నోబిల్ బార్లీ గింజలతో తయారైన ఈ మద్యం తాగే దమ్ముందా అని ఛాలెంజ్‌ని నిర్వహిస్తున్నారు.