Atrocious in Bangladesh..Hindus' houses are on fire
mictv telugu

బంగ్లాదేశ్‌లో దారుణం..హిందువుల ఇళ్లకు నిప్పు

July 19, 2022

బంగ్లాదేశ్‌లోని నరైనల్ జిల్లా, డిఘోలియా గ్రామంలో శుక్రవారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ చిన్న పోస్ట్‌‌ వల్ల తీవ్రమైన మత ఘర్షణలు చేలరేగాయి. దాంతో అక్కడ నివసించే హిందువుల ఇళ్లకు, దేవాలయాలకు ఇస్లామిస్టులు నిప్పు పెట్టారు. అంతేకాదు, వారిపై రాళ్లు కూడా రువ్వారు.

”ఆకాష్ సాహా అనే హిందు యువకుడు ఫేస్‌బుక్‌లో తాజాగా ఓ పోస్ట్‌ను పెట్టాడు. ఆ పోస్ట్ ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందని కొన్ని వర్గాలు ఆరోపించాయి. దాంతో ఇస్లామిస్టులు ఓ హిందూ కుటుంబానికి చెందిన ఇంటిని తగలబెట్టారు. వారిపై దాడులకు పాల్పడ్డారు. ఆ గుంపును చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపాం. అనంతరం ఆకాష్ సాహా, అతని తండ్రి అశోక్ సాహాలను అదుపులోకి తీసుకున్నాం. అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం.” అని స్థానిక పోలీసు అధికారి హరన్ చంద్ర పౌల్ తెలిపారు.

అయితే, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరగడం కొత్తేం కాదు. గతంలో కూడా చాలాసార్లు అక్కడ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. హాజీ సైఫుల్లా నాయకత్వంలో దాదాపు 200 మంది ఇస్లామిస్టులు మార్చిలో ఢాకాలోని ఇస్కాన్ దేవాలయంపై దాడులకు పాల్పడ్డారు. ఆలయాన్ని, విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. భక్తులను కూడా విడిచిపెట్టకుండా వారిపై కూడా అనుచితంగా దాడి చేశారు. అక్కడ హిందువులు మైనార్టీలో ఉండడం, వారిపై దాడులు జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది.

ఈ క్రమంలో శుక్రవారం మరోసారి హిందువులపై, హిందువుల దేవాలయాలపై నిప్పు పెట్టడమే కాకుండా కొంతమంది హిందువులపై రాళ్లు రువ్వడం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.