Atrocious in Nalgonda..weaning by trampling with feet..at last
mictv telugu

నల్గొండలో దారుణం..కాలితో తొక్కుతూ కాన్పు..చివరికి

September 19, 2022

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కాన్పు కోసం ఆసుపత్రిలో చేరిన నిండు గర్భిణీ పట్ల ఆసుపత్రి నర్సులు కఠినంగా ప్రవర్తించారు. ప్రసవ వేదనపడుతున్న మహిళ పొట్టపై కాలితో తొక్కుతూ కాన్పు చేశారు. అప్పటికే తీవ్రమైన రక్తస్రావంతో విలవిలాడిన మహిళ..మగబిడ్డకు జన్మనిచ్చి, మృతి చెందింది.

వివరాల్లోకి వెళ్తే.. కట్టంగూరు మండలం చెర్వు అన్నారం గ్రామానికి చెందిన శిరసు అఖిల మొదటి కాన్పు కోసం ఈ నెల 9న నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది. మూడు రోజుల నుంచి ఆమె నొప్పులతో ఇబ్బందిపడుతున్నా, సాధారణ ప్రసవం పేరిట వైద్యులు నిర్లక్ష్యం చేశారు. ఆపరేషన్ చేయకుండా ఈ నెల 11న నార్మల్ డెలివరీకి ప్రయత్నించారు. డెలివరీ చేసే సమయంలో నొప్పులు తాళలేక గర్భిణీ బిగ్గరగా ఏడుస్తుండడంతో, ఆమెను నర్సులు బూతులు తిట్టారు. పరిస్థితి విషమించిన తర్వాత కాలుతో తొక్కుతూ, పొట్టపై నెడుతూ, ప్రసవం చేయడంతో నిండు గర్భిణీ ప్రాణాలు వదిలింది.

ఈ ఘటనపై అఖిల అత్తమ్మ పూలమ్మ మాట్లాడుతూ..”నా కొడలికి నొప్పులు ఎక్కువకావడంతో డ్యూటీలో ఉన్న నర్సులకు చెప్పాను. దాంతో ఆ నర్సులంతా ‘నొప్పులు రాగానే కాన్సు చేయాలా అలా అనుకుంటే, ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లండి’ అన్నారు. కాసేపటికి నన్ను, నా కొడలిని బండబూతులు తిడుతూ, బెడ్ దగ్గరకు వచ్చారు. నేను చూస్తుండగానే నా కొడలిని ఆ నర్సులు కాలుతో అదిమిపట్టారు. పొట్టపై నెట్టారు. కడుపుపై ఒత్తిడి పెరగడంతో తీవ్ర రక్తస్రావమైంది. మగబిడ్డకు జన్మనిచ్చినప్పటికి, నా కొడలు అఖిల ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయినా నర్సులు ఏ మాత్రం పట్టించుకోకుండా సెల్ఫోన్ చూసుకుంటూ కాలక్షేపం చేశారు. నా కొడుకు అఖిల పరిస్థితిని గమనించి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్ చేశాడు. వెంటనే ఆయన డ్యూటీ డాక్టర్‌కు ఫోన్ చేశారు. పరిస్థితి విషమించటంతో ఐసీయూలో చేర్చి చికిత్స చేశారు. అయినా, రక్తస్రావం ఆగలేదు. చివరకు ఈ నెల 14న గాంధీ ఆస్పత్రికి తరలించాం. పరిస్థితి విషమించడంతో శుక్రవారం(18న) అఖిల మృతి చెందింది” అని ఆమె కన్నీరు మున్నీరు అయ్యింది.