శవం మీద పేలాలు ఏరుకున్న ఆస్పత్రి.. రూ.3 లక్షలు చెల్లిస్తేనే.. - MicTv.in - Telugu News
mictv telugu

శవం మీద పేలాలు ఏరుకున్న ఆస్పత్రి.. రూ.3 లక్షలు చెల్లిస్తేనే..

October 25, 2020

  చెల్లిస్తేనే..

కరోనా సమయంలో వైద్యులే ప్రత్యక్ష దేవుళ్లలా మారిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు కరోనాను క్యాష్ చేసుకోవడానికి గల్లాపెట్టెలు తెరుచుకుని కూర్చున్నాయి. కరోనాకు ఇంకా వ్యాక్సిన్ రాలేదు. కానీ, ప్రైవేట్ ఆసుపత్రులు వేస్తున్న బిల్లులు గుడ్లు తేలేసేలా చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ గురించి ప్రభుత్వాలు కూడా హెచ్చిరిస్తున్నా వారు పట్టించుకోవడంలేదు. కరోనా లక్షణాలు సాధారణంగా ఉంటే ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకుంటే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటేనే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలని అంటున్నారు. అయితే కొందరు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే ప్రాణాలకు గ్యారెంటీ ఉంటుందనే పిచ్చి నమ్మకంలో వెళ్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ల ప్రాణాలు కాపాడటం ఏంటో గానీ, రోగిని నిలువుదోపిడీ చేయడం కూడా అంతే గ్యారెంటీ అని తెలుసుకోలేకపోతున్నారు. 

అలా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్న అభాగ్యులు ఎందరో. మరికొందరు కరోనా సోకిన విషయాన్ని బయటకు చెప్పకుండా గుట్టుగా వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రుల్లో జాయిన్ అవుతున్నారు. 15 నుంచి 20 లక్షల వరకు చెల్లించి కూడా ఇంటికి క్షేమంగా తిరిగిరావడంలేదు. మిగిలిన బిల్లు మొత్తం చెల్లిస్తేనే చనిపోయినవారి మృతదేహాలను ఇస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని కొండాపుర్ కిమ్స్ ఆసుపత్రిలో ఓ దారుణం చోటుచేసుకుంది. గత నాలుగు రోజులుగా కరోనాతో చికిత్స పొందుతూ విజయేందర్‌రెడ్డి చనిపోయాడు. కరోనా వైద్యం కోసం వారు ఇప్పటికే ఆసుపత్రికి రూ.2.50 లక్షలు చెల్లించారు. మరో రూ.3 లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆసుపత్రి సిబ్బంది డిమాండ్ చేసింది. అయితే తమవద్ద అన్ని డబ్బులు లేవని.. ఇంత చెల్లించినా ఇంకా డబ్బులంటే తమ వల్ల కాదంటూ కుటుంబీకులు కన్నీరుమున్నీరు అయ్యారు. అయినా ఆసుపత్రి సిబ్బంది కనికరించలేదు. నిర్దయగా వ్యవహరించింది. దీంతో మృతుడి కుటుంబీకులు కిమ్స్ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.