ఖమ్మంలో దారుణం.. బాలికను తగలబెట్టిన రేపిస్ట్  - MicTv.in - Telugu News
mictv telugu

ఖమ్మంలో దారుణం.. బాలికను తగలబెట్టిన రేపిస్ట్ 

October 5, 2020

Atrocities in Khammam .. Man who burnt a Minor girl

దేశవ్యాప్తంగా మహిళలపై వరుస దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. నేరాలకు కఠిన శిక్షలు పడతాయని తెలిసినా మృగాళ్లు రెచ్చిపోతున్నారు. క్షణిక సుఖం కోసం మహిళలు, చిన్నారుల ప్రాణాలను అన్యాయంగా బలి తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన హత్రాస్ ఘటన ఆందోళనలు చెలరేగుతుండగానే.. ఖమ్మంలో ఓ మృగాడు మరో దారుణానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై దుండగుడు అత్యాచారయత్నం చేశాడని ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పల్లెగూడెం గ్రామానికి చెందిన మైనర్ బాలిక(13) ఖమ్మంలోని ముస్తాఫా నగర్‌లో ఉంటున్న ఓ ధనవంతుల ఇంట్లో  పనిమనిషిగా పనిచేస్తోంది. ఆ బాలికపై ఇంటి యజమాని కుమారుడు కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక ప్రతిఘటించడంతో అతను మరింత పశువులా మారిపోయాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.

మంటలతో కాలిపోతూనే బాలిక హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీసింది. తనను కాపాడాలని కేకలు వేసింది. స్థానికులు వెంటనే మంటలను చల్లార్చి ఆమెను  ఖమ్మంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. 70 శాతం కాలిన గాయాలతో బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడి కుటుంబ సభ్యులు.. బాలికను తీవ్రంగా భయపెట్టినట్లు తెలుస్తోంది. విషయం ఎవరికైనా చెబితే బాలికతో పాటు తల్లిదండ్రులను కూడా చంపుతానని బెదిరించినట్లు సమాచారం. ఈ ఘటన పది రోజుల క్రితం చోటు చేసుకోగా.. విషయం బయటకు పొక్కకుండా నిందితుడి కుటుంబ సభ్యులు జాగ్రత్తపడ్డారు. ప్రైవేటు సెటిల్మెంట్‌కు, కుల పంచాయితీలు చేసినట్టు సమాచారం. అయితే రాజీ కుదరకపోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తమను చంపేస్తామని వారు బెదిరిస్తున్నారని.. న్యాయం చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.