నిజామాబాద్ కంఠేశ్వర్‌లో దారుణం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ సెల్లార్లో ఆడుకుంటున్న 18 నెలల చిన్నారి మీద నుంచి కారు పోవడంతో పాప విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు తేల్చారు. నగరంలోని శివం అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న మోహన్ సెల్లార్లో నివాసం ఉంటున్నాడు. అతను వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా అతని భార్య చందన ఇళ్లలో పాచి పని చేస్తున్నారు. ఇద్దరూ కష్టపడి తమ ఇద్దరు కుమార్తెలను పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్న కుమార్తె మనస్వి (18 నెలలు) సెల్లార్లో ఆడుకుంటోంది. ఇంతలో అపార్ట్మెంట్లోని ఓ వ్యక్తి కారు తీస్తున్నాడు. అప్పుడు ఆ పాప వెళ్లి కారు ముందు భాగంలోనే నిల్చుంది.
అది గమనించకుండా డ్రైవర్ కారును పోనిచ్చాడు. దీంతో చిన్నారి కారు చక్రాల కింద నలిగిపోయింది. కారు డ్రైవర్ కారు తీసుకుని వెళ్లిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన చిన్నారి తల్లి పాపను ఎత్తుకుంది కానీ, అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదానికి కారకుడైన వ్యక్తి పేరు అపార్ట్మెంట్ ఓనర్ ఎలిజిబెత్ రాణి కుమారుడు కడారి స్టీఫెన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై 3వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.