సిద్దిపేటలో దారుణం..పెళ్లైన 38 రోజులకే - MicTv.in - Telugu News
mictv telugu

సిద్దిపేటలో దారుణం..పెళ్లైన 38 రోజులకే

May 9, 2022

 

తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లై, 38 రోజులు గడవక ముందే కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చి, ఛాతీ నొప్పితో చనిపోయాడని నాటకమాడిన ఘటన.. దుబ్బాక మండలం చిన్న నిజాంపేటకు చెందిన కోనాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..”చంద్రశేఖర్ (24)కు తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన శ్యామల (19)తో గత మార్చి 23న పెద్దల సమక్షంలో పెళ్లయింది. మూడేళ్లుగా శ్యామల..గుడికందులకే చెందిన శివకుమార్ (20) అనే యువకుడితో ప్రేమలో ఉంది.

పెద్దల ఒత్తిడితో శ్యామల.. చంద్రశేఖర్‌ను పెళ్లి చేసుకుంది. ఇష్టంలేని పెళ్లి చేశారని ప్రియుడు శివతో కలిసి హత్య చేయడానికి ప్లాన్ వేసింది. మొదటగా ఆహారంలో ఎలుకల మందు కలిపింది. దాంతో చంద్రశేఖర్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని తిరిగి ఇంటికి వచ్చాడు. ఏప్రిల్ 28న శ్యామల.. చంద్రశేఖర్‌ను భర్తను తీసుకొని ఏకాంతంగా గడుపుదామంటూ అనంత సాగర్ శివారుకి తీసుకెళ్లి, శివ, అతడి స్నేహితులు అయిన రాకేశ్, రంజిత్, మేనబావ సాయికృష్ణ, వరుసకు సోదరుడు భార్గవ్ కలిసి చంద్రశేఖర్‌ను అదిమిపట్టి శ్యామల, శివ రుమాలుతో గొంతు నులిమి చంపేశారు” అని తెలిపారు.

అనంతరం చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేస్తుండగా అసలు నిజం బయటపడడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆరుగురు నిందితులను ఆదివారం సిద్దిపేటలోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.