ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లాలో గురువారం ఉదయం దారుణం జరిగింది. బత్తాయి తోటలో కలుపు తీసేందుకు వెళ్తున్న ఆటోపై విద్యుత్ తీగలు తెగిపడి ఆటోలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ”తాడిమర్రి మండలం బుడ్డపల్లికి చెందిన కొంతమంది కూలీలు చిల్లకొండయ్యపల్లికి చెందిన ఆటోలో వెళ్తుండగా విద్యుత్ తీగలు తెగిపడడంతో ఆటోలోనే ఐదుగురు సజీవ దహనమైయ్యారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మహిళను చుట్టుపక్కల ఉన్న స్థానికులు ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం అందింది. అయితే, ఈ కూలీలంతా బత్తాయి తోటలో చెట్ల వద్ద కలుపు తీసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన ఐదుగురు కూడా మహిళలే” అని వివరాలను వెల్లడించారు.