జనగామలో దారుణం.. వీఆర్వోకు కులబహిష్కరణ  - MicTv.in - Telugu News
mictv telugu

జనగామలో దారుణం.. వీఆర్వోకు కులబహిష్కరణ 

September 23, 2020

vroo

కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఉండగా ఇంకా కొన్ని గ్రామాల్లో పంచాయితీలు కొనసాగుతున్నాయి. పంచాయితీ పెట్టి పైశాచిక తీర్పులు ఇస్తూ పాత దురాచారాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు కొందరు పెద్దమనుషులు. ఈమధ్య దేశవ్యాప్తంగా అక్కడక్కడా కొన్ని గ్రామాల్లో పంచాయితీలు ఇస్తున్న తీర్పులు ఎంత దారుణంగా ఉంటున్నాయో తెలిసిందే. తాజాగా అలాంటి పైత్యపు పంచాయితీ జనగామ జిల్లాలో జరిగింది. జనగామ మండలం యశ్వంతపూర్‌లో వీఆర్‌ఓను పంచాయితీ పెద్దలు కుల బహిష్కరణ చేశారు. వంశపారంపర్యంగా తండ్రి ద్వారా సంక్రమించిన వీఆర్ఓ ఉద్యోగం కోసం రూ.15 లక్షలు కావాలని పాలివాళ్లు డిమాండ్ చేశారు. దీంతో అతను అంత డబ్బు ఇచ్చుకోలేనని చెప్పాడు. ఈ విషయమై ఆగ్రహించిన గ్రామస్తులు పంచాయితీ పెట్టారు. 

అతని కష్టం, అతని ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం తెలుసుకోకుండా పంచాయితీ పెద్దలు ఏకపక్షంగా అతన్ని దోషిగా తేల్చారు. బాధితుడిని కులబహిష్కరణ చేశారు. అంతటితో వారి రాక్షస ఆనందాన్ని చల్లార్చుకోలేదు. బాధితుడికి శిరోముండనం చేయాలని అనాగరిక తీర్పును వెలువరించారు. ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పంచాయితీ పెద్దలను విచారించనున్నమని పోలీసులు తెలిపారు.