హైదరాబాద్‌లో ఇవాళ జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. తనతో దురుసుగా ప్రవర్తించారని ఒకరు ఫిర్యాదు చేయగా, దుర్భాషలాడారని మరొకరు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలోని యాచారంలో రహదారి శంకుస్థాపనకు వెళ్లారు. కార్యక్రమంలో పాల్గొనబోయిన ఎమ్మెల్యేని యాచారం ఎంపీపీ సుకన్య అడ్డుకోబోయారు. ఎమ్మెల్యే ప్రొటోకాల్ పాటించడం లేదని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తనతో దురుసుగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకి సహకరించిన ఇబ్రహీంపట్నం ఏసీపీ, సీఐ నారాయణపై కూడా ఎంపీపీ ఫిర్యాదు చేశారు. ఎంపీపీ ఫిర్యాదు మేరకు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదిలావుండగా ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలాపై కూడా పోలీసలు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. బీజేపీ నేత బంగారు శృతి ఫిర్యాదు మేరకు చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. చాదర్‌ఘాట్ పరిధిలో ఎస్సీ బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు శృతి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే తనను ఎమ్మెల్యే బలాల కించపరిచేలా మాట్లాడారని శృతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.తనతో దురుసుగా ప్రవర్తించారంటూ శ్రుతి ఫిర్యాదు చేయగా, సదరు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.