పాకిస్తాన్‌కు కొత్త కష్టాలు.. గోధుమ పిండి లేక.. - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్‌కు కొత్త కష్టాలు.. గోధుమ పిండి లేక..

January 21, 2020

fndnn

దాయాది దేశం పాకిస్తాన్‌కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఆ దేశం తీవ్రమైన గోధుమ పిండి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో సామాన్య ప్రజలు చపాతీ తినేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొరత కారణంగా మార్కెట్లో గోధుమ పిండి ధరలకు రెక్కలు వచ్చాయి. పేదలు దాన్ని కొనుక్కోనే స్థోమత లేకపోవడంతో బియ్యం వైపు చూస్తున్నారు. కనీసం తినడానికి తిండిలేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 15 వరకు దీని ప్రభావం ఇలాగే ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

పాక్‌లో మెజార్టీ ప్రజలు గోధుమ పండితో తయారు చేసే రొట్టెలను ఆహారంగా తీసుకుంటారు. అయితే అక్కడి ప్రభుత్వం ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌కు  పెద్ద ఎత్తున గోధుమలను ఎగుమతి చేయడంతో దేశంలో ఈ సంక్షోభం తలెత్తింది. ప్రధానంగా ఖైబర్ ఫఖ్తూన్ ఖవా,పెషావర్ నగరాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతాల్లో  గోధుమపిండి విక్రయించే 2,500 దుకాణాలు మూతపడ్డాయి. ఈ సంక్షోభం ఏప్రిల్ నెల వరకు ఇలాగే ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అప్పటికి పంజాబ్‌లో గోధుమ పంట చేతికి రావడంతో కొరత తప్పే అవకాశం ఉందంటున్నారు. తాజా సంక్షోభంతో అక్కడి మార్కెట్లలో గోధుమ పిండి ధర రూ. 43కు పెరిగింది. గోధుమ సంక్షోభంపై చర్యలు తీసుకోవడంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ విఫలమైందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.