స్నానం చేయకుండా  తాకాడని దళితుడిపై త్రిశూలంతో దాడి - MicTv.in - Telugu News
mictv telugu

స్నానం చేయకుండా  తాకాడని దళితుడిపై త్రిశూలంతో దాడి

February 17, 2020

uttar pradesh

దళితుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొని వచ్చినా.. వాళ్ళపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చేయి కడుక్కోకుండానే ప్రసాదం ముట్టుకున్నాడనే నెపంతో దళిత యువకుడిపై త్రిశూలంతో దాడి జరిగింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లాలోని డొకాటీ గ్రామంలో చోటుచేసుకుంది. 

శనివారం రాత్రి స్థానిక దేవాలయంలో గ్రామస్థులు సామూహిక భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గ్రామస్థులందరూ పాల్గొన్నారు. ఆహారంతో పాటు ప్రసాదం కూడా ఇచ్చారు. స్థానికంగా ఉన్న బొగ్గుల షాపులో పనిచేసే ఉపేంద్ర రామ్‌ కూడా దీనికి హాజరయ్యాడు. ఉపేంద్ర.. షాపు నుంచి నేరుగా భోజనాలకు వచ్చాడు. దీంతో అతడి చొక్కా, చేతులపై నల్లగా మాసిపోయి ఉన్నాయి. అయితే అతడు చేతులు కడుక్కోకుండానే ఆహారం తీసుకునేందుకు ముందుకొచ్చాడు. అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులు దీనికి అభ్యంతరం చెప్పారు. చేయి ఎందుకు కడుక్కోలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ మొదలైంది. గొడవ పెద్దదవ్వడంతో ఆ నలుగురు ఉపేంద్రను అక్కడే ఉన్న త్రిశూలంతో పొడిచారు. ఉపేంద్రను గ్రామస్థులు వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.