టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాహనంపై చెప్పులు, రాళ్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

 టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాహనంపై చెప్పులు, రాళ్లు..

October 15, 2020

Attack on ibrahimpatnam trs mla kishan reddy

ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. వర్షాల కారణంగా నిండిన చెరువుకు పూజ చేసేందుకు ఈరోజు ఆయన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఫార్మా సిటీ కోసం చేస్తున్న భూసేకరణను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీల కోసం తాము భూములు కోల్పోతుంటే కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో పర్యటించవద్దని అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే వెనుతిరిగారు. ఆయన కాన్వాయ్‌పై కొందరు రైతులు చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు రైతులపై లాఠీఛార్జ్ చేశారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

యాచారం, కందుకూరు మండలాల మధ్య ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుని తలపెట్టింది. ఇందుకోసం 19,333 ఎకరాలు సేకరణ చేస్తోంది. ఇప్పటికే 10,490 ఎకరాల భూమిని సేకరించింది. మరో 8,843 ఎకరాలు సేకరించాల్సివుంది. మేడిపల్లిలో తమ పట్టాభూములు ఇవ్వబోమని కొందరు రైతులు ఎమ్మార్వోతో గొడవకు దిగారు. దీంతో ప్రభుత్వం అసెన్డ్‌ భూములకు రూ.8 లక్షలు, పట్టా భూములకు రూ.12.50లక్షలు పరిహారం ఇచ్చారు. ఇందులో అసైన్డ్‌ భూములిచ్చిన రైతులకు ఇప్పుడు 120గజాల ప్లాటు మాత్రమే ఇస్తామని మంత్రులు ప్రకటించారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు మండలాల పరిధిలో అసైన్డ్‌ భూముల సేకరణ పూర్తవడంతో, ప్రస్తుతం పట్టా భూముల సేకరణ జరుగుతోంది.