హైదరాబాద్ పరిశర ప్రాంతాల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా దారి కాచి అందిన కాడికి దోచేస్తున్నారు. ఎదురుతిరిగిన వారిపై దాడులకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా నార్సింగ్‌లో ఓ వ్యక్తి ప్రాణాలను తీసేశారు దుండగులు. విచారణకు వెళ్లిన పోలీసులపై కూడా తల్వార్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారు.
గురువారం ఔటర్ సర్వీస్ రోడ్ మైసమ్మ దేవాలయం సమీపంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను నిందితులు అడ్డగించారు. వారిని డబ్బులు డిమాండ్ చేశారు. వారు నిరాకరించడంతో కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో గంధంగూడకు చెందిన కిషోర్ మృతి చెందగా, తులసి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వారి నుంచి రూ.15 వేలు నగదు తీసుకొని నిందితులు పరారయ్యారు. గాయపడిన తులసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలో దిగారు. విచారణలో భాగంగా కూకట్ పల్లికి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ రాజు, విజయ్ జగద్గిరిగుట్ట సిక్కుల బస్తీకి వెళ్లారు. ఈ క్రమంలో సర్దార్ కరణ్ సింగ్ వారిపై తల్వార్‌తో దాడికి దిగాడు. ఈ ఘటనలో పోలీసులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.