ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో నివాసముంటున్న వీరంకి లక్ష్మీ తిరుపతమ్మ(40) అనే వివాహితపై హత్యాచారం జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై టీడీపీ నాయకులు జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడుతూ, హత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో నారా లోకేష్ గురువారం సాయంత్రం హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు తుమ్మపూడికి చేరుకున్నారు. గమనించిన కొందరు వైసీపీ కార్యకర్తలు లోకేశ్‌పై రాళ్లతో దాడి చేయడానికి యత్నించారు. వెంటనే పరిస్థితిని గమనించిన టీడీపీ కార్యకర్తలు లోకేష్‌పై దాడి జరగకుండా చుట్టుముట్టారు.
మరోపక్క టీడీపీ కార్యకర్తల మధ్య మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అనుచరుల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు తోచకుంటూ దాడులు చేసుకున్నారు. కోపంతో రగిలిపోయిన వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు రెండు పార్టీల కార్యకర్తలను అదుపు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే డ్రైవర్ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.