ఏఎస్సై ఆత్మహత్యాయత్నం.. ఘట్‌కేసర్ పీఎస్‌లో కలకలం.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏఎస్సై ఆత్మహత్యాయత్నం.. ఘట్‌కేసర్ పీఎస్‌లో కలకలం..

August 15, 2020

Attempted incident by ASI .. Ghatkesar Police Station..

స్వాతంత్య్ర దినోత్సవం రోజే ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏఎస్సై ఆత్మహత్యా ప్రయత్నం తీవ్ర కలకలం రేపింది. భార్యకు ఫోన్ చేసి ఇదే తన చివరి కాల్ అని చెప్పి, చెట్టుకు ఉరి వేసుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆయన భార్య పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని ఆయనను ఆత్మహత్యా ప్రయత్నం నుంచి కాపాడారు. పై అధికారుల వేధింపులే ఆయన ఆత్మహత్యా యత్నానికి కారణం అని తెలుస్తోంది. ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌లో రామకృష్ణ అనే వ్యక్తి ఏఎస్సైగా విధుల నిర్వహిస్తున్నాడు. ఈనెల 10న ఒక కేసు విషయంలో కొంతమంది వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కి తీసుకువచ్చారు. ఆ సమయంలో రామకృష్ణ విధుల్లో ఉండగా.. స్టేషన్‌కు తీసుకొచ్చినవారిలో ఒక వ్యక్తి పరారయ్యాడని సమాచారం. 

దీంతో విధుల్లో ఉన్న ఏఎస్సై రామకృష్ణ నిర్లక్ష్యం వల్లే అతను తప్పించుకున్నాడని పై అధికారులు అతన్ని మందలించారు. వారి మాటలతో తీవ్ర మనస్తాపానికి, అవమానానికి గురైనట్లు భావించాడు రామకృష్ణ. ఈ క్రమంలో నేడు పంద్రాగస్ట్ జెండా పండుగకు హాజరయ్యాడు. అనంతరం ఇంటికి ఫోన్ చేసి ఇదే నా చివరి కాల్ అని చెప్పి ఫోన్ కట్ చేసినట్లు తెలుస్తోంది. రామకృష్ణ మాటలతో వెంటనే అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, రామకృష్ణ ఫోన్ సిగ్నల్‌ని ట్రాక్ చేశారు. ఘట్‌కేసర్ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకునే సమయంలోనే అక్కడికి వెళ్లి అతన్ని రక్షించారు. అనంతరం అతన్ని సమీపంలోని క్యూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రామకృష్ణ సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.