ఆఫీసర్ భార్య మాంసం కోరిక..తీర్చబోయి అటెండర్ బలి
లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కాలక్షేపం కోసం సినిమాలు చూస్తున్నారు. అలాగే ఇష్టమైన వంటకాలు చేసుకుని తింటున్నారు. ఈ క్రమంలో ఓ అధికారి భార్య ఇషమైన వంటకం కోరిక ఓ మనిషి ప్రాణం తీసింది. ఈ సంఘటన విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గుంటులో ఓ అధికారి భార్యకు మాంసం తినాలనిపించడంతో అటెండరును గన్నవరం వెళ్లి తీసుకురావాలని కోరారు. దీంతో అటెండర్ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బైక్‌పై గుంటూరు నుంచి కృష్ణా జిల్లాకు వెళ్ళాడు. దురదృష్టవశాత్తు ఆ బైక్ ఓ పోలీసు వాహనాన్ని ఢీ కొనడంతో అటెండరు గాయపడ్డాడు. అక్కడి పోలీసులు గుర్తుతెలియని వాహనం ఢీ కొన్నట్లుగా కేసు నమోదు చేసి బాధితుడిని గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ కు తరలించారు. అతడు సుమారు 18 గంటల పాటు మృత్యువుతో పోరాడి మృతిచెందాడు. ఈ విషయాన్ని సదరు అధికారి గోప్యంగా ఉంచారు.
ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఉద్యోగ వర్గాలు నిరసనకు దిగాయి. కుటుంబీకులను మేనేజ్ చేసి గోప్యంగా ఉంచినప్పటికీ ఉద్యోగ వర్గాలు ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చాయి. దీంతో ఈ విషయం చర్చనీయాంశం అవుతోంది. ఈ సంఘటన గురించి విచారించడానికి ఉద్యోగసంఘాల జీజీహెచ్ హాస్పిటల్ వర్గాలను సంప్రదించగా రెండు రోజులుగా ఎటువంటి యాక్సిడెంట్, మరణాలు లేవని తెలిపాయి. ఫలానా వ్యక్తికి విజయవాడ పరిధిలో ప్రమాదం జరిగి ఇక్కడకు తీసుకువచ్చారు కదా అని ప్రశ్నించడంతో అప్పుడు అతని మృతి విషయాన్ని నిర్ధారించారు. ఇదిలావుంటే అధికారి భార్య పని మీద కాకుండా ఆ అటెండర్ విజయవాడ నుంచి గుంటూరుకు వస్తున్నట్లుగా చెప్పమని అతని బంధువులుపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.