నేడు జలావాసానికి అత్తివరరాజ స్వామి.. మళ్లీ 40 ఏళ్ల తర్వాతే..
కాంచీపురంలో పెరుమాళ్ ఆలయంలోని అత్తివరదరాజ స్వామి నేడు జలావాసానికి చేరుకోనున్నారు. మళ్లీ తిరిగి 40 ఏళ్ల తర్వాత భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. చివరి రోజు కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. నేడు సాయంత్రానికి స్వామిని సరస్సులోని జలావాసానికి పంపించనున్నారు అర్చకులు. ఇప్పటి వరకు సుమారు కోటి మంది భక్తులు దర్శించుకున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విష్ణుమూర్తి అవతారమైన అత్తివరదరాజ స్వామి 1979 సంవత్సరంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తిరిగి ఈ ఏడాది జులై 1న ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 31 రోజులపాటు శయన అవతారంలో..ఆగస్టు1 నుంచి నిలబడిన అవతారంలో స్వామి వారు దర్శనమిచ్చారు. కోనేటి గర్భగుడిలో ఉండే స్వామి వారు 48 రోజుల పాటు భక్తులకు దర్శనం ఇచ్చారు. 16వ శతాబ్ధంలో కాంచిపురంపై జరిగిన దండయాత్రలో విగ్రహాన్ని అపహరించేందుకు ప్రయత్నించారు. అప్పటి నుంచి విగ్రహాన్ని కాపాడుకునేందుకు ఓ వెండిపెట్టెలో కోనేరులో భద్రపరుస్తున్నారు. అత్తితో చేసిన విగ్రహం కావడం వల్ల నీటిలో ఉన్నా చెక్కుచెదరకుండా ఉంటోంది.