పెళ్లాం రాలేదని బాంబు పేల్చాడు.. ఊరంతా దడ - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లాం రాలేదని బాంబు పేల్చాడు.. ఊరంతా దడ

March 28, 2022

bnm

భర్తల మీద భార్యలు అలిగో, గొడవ పెట్టుకొనో పుట్టింటికి వెళ్లిపోవడం ప్రతీ దాంపత్యంలో జరిగేదే. దానికి భర్త బతిమాలో, కుదరకపోతే పెద్ద మనుషులతో మాట్లాడించి తీసుకురావడం చేస్తారు. కానీ, ఒకడు మాత్రం ఆ ఇంట్లో ఏకంగా బాంబునే పెట్టేశాడు. అది పేలడంతో ఊరంతా ఒక్కసారిగా హడలిపోయింది. ఆగ్రాకు సమీపంలో ఈ ఘటన జరిగింది. బమ్రౌలీ కటారా ప్రాంతానికి చెందిన ఆశ అనే మహిళకు హరిసింగ్‌తో వివాహమైంది. ఏడాది క్రితం దంపతుల మధ్య పొరపొచ్చాలు రావడంతో ఆశ హరిసింగును వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో హరిసింగ్ ఆదివారం తన భార్యను తీసుకురావడానికి అత్తారింటికి వెళ్లాడు. ఇంటికెళ్దాం రమ్మని భార్యను పిలువగా, ఆశ రానని మొండికేసింది. దీంతో కోపోద్రిక్తుడైన హరిసింగ్ భార్యకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టాడు. ఒక నాటు బాంబును సంపాదించి అత్తారింట్లో పెట్టేశాడు. దానికి కాలుతున్న అగరబత్తీని వెలిగించి వెళ్లిపోయాడు. అగరబత్తీ క్రమంగా కాలుతూ.. సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో బాంబును తాకింది. మంట అంటుకోవడంతో బాంబు పేలింది. ఆ ధాటికి పక్కన ఉన్న రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ శబ్దం రావడంతో హడలిపోయిన గ్రామస్థులు పరుగులు పెట్టారు. పేలుడు సమయంలో అత్తారింట్లో ముగ్గురు నిద్రిస్తుండగా, ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బాంబు పేలుడుపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.