ఆఫ్ఘనిస్థాన్ తో జరగాల్సిన వన్డే సిరీస్ ని క్రికెట్ ఆస్ట్రేలియా రద్దు చేసుకుంది. మార్చిలో భారత పర్యటన అనంతరం యూఏఈ వేదికగా మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. కానీ, దాన్ని రద్దు చేసుకోవడంతో ఆస్ట్రేలియాకు 30 పాయింట్ల మేర నష్టం వాటిల్లనుంది. ఆ మేర ఆఫ్ఘనిస్థాన్ కి లబ్ది చేకూరుతుంది. వన్డే ప్రపంచ కప్ రానున్న నేపథ్యంలో సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టాప్ 8లో నిలిచే జట్లు మాత్రమే వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం ఆసీస్ జట్టు 120 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా, ఆఫ్ఘాన్ జట్టు 115 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.
అయితే సిరీస్ రద్దుతో 30 పాయింట్లు పోయినా టోర్నీకి అర్హత సాధించే క్రమంలో ఆస్ట్రేలియాకు ఎలాంటి ఢోకా ఉండదు. ఇక సిరీస్ రద్దుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఆ దేశ పరిస్థితులను కారణంగా చూపింది. ఆఫ్ఘాన్ తాలిబన్ ప్రభుత్వం ఇటీవల అక్కడి మహిళలపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. చదువులు, ఆటలు, ఉద్యోగాలు వంటి వాటిల్లో మహిళల సామర్ధ్యానికి తగ్గట్టు అవకాశాలను కల్పించాల్సింది పోయి వివక్ష చూపడంతోటే సిరీస్ రద్దు చేసుకుంటున్నామని తెలిపింది.
తమ దేశ ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, క్రికెట్ డెవలప్ మెంట్ విషయంలో ఆఫ్ఘాన్ బోర్డుతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంటామని వెల్లడించింది. ఆఫ్ఘాన్ లో మహిళలు, చిన్నారుల పరిస్థితి మెరుగయ్యేందుకు సాయం చేస్తామని పేర్కొంది.