భార్య అలిగితే ఏ సినిమాకో, శిఖారుకో భర్తులు తీసుకెళ్లడం కామన్. మరీ మొండికేస్తే ఏ బంగారమో, చీరో కొని ఆమె కోపాన్ని తగ్గించినవారు లేకపోలేదు. కానీ ఓ భర్త మాత్రం తన భార్య ముఖంలో చిరునవ్వు ను తెప్పించేందుకు తన అదృష్టాన్నే పరీక్షించుకున్నాడు. ఒకేసారి రెండు లాటరీ టికెట్లు కొని లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎదురుచూశాడు. లడ్డూ కావాలా నాయనా అంటూ ఒకేసారి రెండు లాటరీలు తగలడంతో రూ. 16 కోట్లను గెలుచుకున్నాడు సదరు భర్త. లక్ష్మీ దేవి కరుణిస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారు అనడానికి ఇప్పుడు ఈ భర్త ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఈ లాటరీ సదరు వ్యక్తి జీవితాన్నే మార్చేసింది. కోట్ల వర్షం కురవడంతో సంతోషంలో మునిగి తేలుతున్నాడు భర్త.
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ కు చెందిన ఓ జంట గత 30 ఏళ్లుగా ఒకే నంబరు లాటరీ టికెట్‌ను కొంటోంది. లక్షీదేవి వరిస్తుందని భావించిన ప్రతిసారి ఈ జంటకు నిరాశే ఎదురయ్యేది. దీంతో తమ అదృష్టం ఇంతే అని సరిపెట్టుకుంటున్నారు. ఓ రోజు తన పేరుమీద లాటరీ టికెట్ తీసుకోలేదని భార్య కోపంతో రగిలి అలిగింది. దీంతో ఆమె మొహంలో చిరునవ్వును చూడాలన్న కోరికతో ఆమె పేరు మీదే మరుసటి వారం రెండు లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు భర్త. అదృష్టం తలుపు తట్టడంతో ఒక్క రోజులోనే కోటీశ్వరురు అయ్యారు ఈ దంపతులు.
లాటరీ తగలడంతో సదరు భర్త తన అనుభవాలను తెలిపాడు..” 30 ఏళ్లుగా మేము లాటరీ టికెట్ కొంటున్నాము. గత వారం నేను నా భార్య పేరు మీద లాటరీ తీసుకోవడం మరిచిపోయాను. దీంతో నా భార్య నా మీద అలిగింది. తన అలకను తీర్చడానికి తన పేరు మీదే ఈ వారం రెండు టికెట్లను కొన్నాను. ఒక టికెట్ నెంబరు సెర్చ్ చేయగా వన్ మిలియన్ డాలర్లు గెలుచుకున్నట్లు తెలిసింది. చాలా ఆనందపడ్డాను. ఆ తరవువాత రెండో టికెట్ నెంబర్ కూడా చూడగా దానికి లాటరీ తగలింది.
మొత్తంగా రెండు టికెట్లకు కలిపి 2 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ విషయాన్ని భార్యకు చెబితే ఎగిరి గంతులేసింది. అయితే లాటరీలో డబ్బు గెలుచుకుంటామనే నమ్మకం నిజం కావడానికి మాకు చాలా కాలం పట్టింది. ఈ విజయాన్ని మా ఫ్యామిలీతో పంచుకున్నాను. ఈ డబ్బులో కొంత కూతురికి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాను. మిగితాది మనవళ్ల భవిష్యత్తుకు ఉపయోగిస్తాను.