క్రికెట్ అభిమానినే.. ఆటగాళ్లకు డ్రింక్స్ మోసుకెళ్లిన ప్రధాని.. - MicTv.in - Telugu News
mictv telugu

క్రికెట్ అభిమానినే.. ఆటగాళ్లకు డ్రింక్స్ మోసుకెళ్లిన ప్రధాని..

October 24, 2019

అభిమానం ఎక్కువైతే వారికోసం ఏమైనా చేయడానికి వెనకాడరు. అందుకు హోదా, అధికారం కూడా అడ్డు రాదేమో. అందుకు ఈయన నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్నారు. క్రికెటర్లకు కూల్‌డ్రింకులు మోసుకెళ్లి ఇవ్వడం బహుశా ఈ ప్రధానికే చెల్లిందేమో. ఏంటీ ప్రధానియా అని ఆశ్చర్యపోకండి.. మీరు విన్నది నిజమే. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ క్రికెట్‌కు వీరాభిమాని. తాజాగా శ్రీలంక జట్టు ఆసీస్ పర్యటనకు రాగా, సన్నాహాక మ్యాచ్‌గా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టుతో పోటీ నిర్వహించారు. 

కాన్ బెర్రాలో జరిగిన ఈ పోరులో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టు వికెట్ తేడాతో గెలిచింది. అయితే ఈ ఆట కన్నా ఎక్కువగా ఆసీస్ ప్రధాని స్కాట్ మోరిసనే హైలైట్ అయ్యారు. ఎందుకంటే శ్రీలంక జట్టు బ్యాటింగ్ చేస్తుండగా, ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ ఆటగాళ్ల కోసం ఆయన డ్రింక్స్ మోసుకొచ్చి అందరికీ ఇచ్చారు. అప్పుడు ఆయన తాను ప్రధానిని అన్న విషయాన్ని కూడా మరిచిపోయారు. తాను ఒక క్రికెట్ అభిమానిని మాత్రమే అనుకున్నారు. ఎంతో నిరాడంబరంగా డ్రింక్స్ కంటెయినర్ తీసుకువచ్చి ఆటగాళ్లకు అందించారు. అంతేకాదు, ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్ల వద్దకు వెళ్లి వారిని మరింత ఉత్సాహపరిచారు. ఇదంతా చూస్తున్న క్రికెట్ అభిమానులు ఈలలు, చప్పట్లతో ప్రధానిని అభినందించారు.