సాగరతీరాన టీం ఇండియాకు ఘోర పరాభవం ఎదురైంది. రెండో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ చిత్తైంది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లలో చేధించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (34 బంతుల్లో 62, 5 ఫోర్లు, 6 సిక్సర్లు), హెడ్ (30 బంతుల్లో 51, 10 ఫోర్లు) మెరుపు అర్థసెంచరీలతో చెలరేగారు. బౌలర్లు ప్రదర్శించిన దూకుడునే ఆస్ట్రేలియా బ్యాటర్లు కూడా ప్రదర్శించారు. పోటీ పడుతూ భారత్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు. ప్రత్యర్థి బౌలర్లు ఏకంగా పది వికెట్లు తీసిన పిచ్ లో భారత్ బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక చేతులెత్తేశారు.
ఓపెనర్ల దూకుడు
చేధనలో ఆసీస్ ఓపెనర్లు హెడ్, మిచెల్ మార్ష్ రెచ్చిపోయారు. ఆరంభం నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగారు. స్వల్ప లక్ష్యమనే కనికారం లేకుండా భారత్ బౌలర్లను ఆటాడుకున్నారు. టీ 20 ఆటను గుర్తు చేస్తూ బౌండరీల వర్షం కురిపించారు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లలో హెడ్ ఏకంగా 4 బౌండరీలు బాదేశాడు. అంతకుముందు షమీ ఓవర్‌లో మిచెల్ రెండు సిక్స్‌లు, ఫోర్ కొట్టాడు. ఇక ఆర్థిక్ పాండ్యా వేసిన 8 ఓవర్‌లో మిచెల్ మూడు సిక్సర్లతో విజృంభించాడు. భారత్ పరుగుల చేయలేక వికెట్లు సమర్పించుకొని ఇబ్బంది పడితే..ఆస్ట్రేలియ ఇన్నింగ్స్ అందుకు భిన్నంగా సాగింది.
స్టార్క్ జోరు.. భారత్ భేజారు
అంతకుముందు మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 26 ఓవర్లలోనే 117 పరుగులకి ఆలౌటైంది. మొదటి వన్డేకు దూరమై రెండో వన్డేకు ఎంట్రీ ఇచ్చిన రోహిత్ .. శుభమన్ గిల్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు.అయితే మొదటి ఓవర్ నుంచే స్టార్క్ వికెట్ల వేట మొదలు పెట్టేశాడు. మొదట గిల్(0), తర్వాత రోహిత్(13), మొదటి వన్డే తరహాలోనే మరోసారి మొదటి బంతికే సూర్యకుమార్ యాదవ్(0), అనంతరం కేఎల్ రాహుల్‌ను పెవిలియన్‌కి పంపించేశాడు. ఈ దశలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటు చేసిన అతనికి సహకారం అందించేవాళ్లు కరువయ్యారు. హార్దిక్ క్రీజ్‌లోకి వచ్చిన వెంటనే ఔటయ్యాడు. తర్వాత కోహ్లీ కూడా వికెట్లు 31 పరుగుల వద్ద వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (39 బంతుల్లో 16), అక్షర్ పటేల్ (29 బంతుల్లో 29) పుణ్యాన 117 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 5, అబాట్ 3, ఎల్లీస్ 2 వికెట్లు పడగొట్టారు. సిరీస్‌లో నిర్ణయాత్మకమైన మూడో వన్డే ఈనెల 22న చెన్నై వేదికగా జరగనుంది.