రేప్ కేసులో శ్రీలంక క్రికెటర్.. వెలుగులోకి సంచలన విషయాలు - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ కేసులో శ్రీలంక క్రికెటర్.. వెలుగులోకి సంచలన విషయాలు

November 8, 2022

టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనడానికి ఆస్ట్రేలియా వెళ్లిన శ్రీలంక జట్టు లీగ్ దశలోనే ఇంటి దారి పట్టింది. అయితే ఆ జట్టు ఆటగాడు ధనుష్క గుణ తిలక అత్యాచారం కేసులో ఇరుక్కోవడంతో అతడిని మాత్రం వదిలేసి మిగతా టీం స్వదేశానికి వెళ్లిపోయింది. ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేయడంతో గుణ తిలకను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ కూడా రాకపోవడంతో ఆ దేశంలోనే విచారణ ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అసలేం జరిగింది?

ఆస్ట్రేలియా సెక్స్ క్రైమ్ విభాగం డిప్యూటీ కమాండర్ జేన్ ప్రకారం.. గుణ తిలక టిండర్ డేటింగ్ యాప్‌‌‌‌లో సిడ్నీకి చెందిన ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. వారిద్దరూ వారాల పాటు చాటింగ్ చేసుకొని గత బుధవారం సిడ్నీలోని ఓపెరా బార్‌లో మొదటి సారి ముఖాముఖి కలుసుకున్నారు. అయితే తర్వాతి రోజు మ్యాచ్ ఉండడంతో వీరు మహిళ ఇల్లు ఉన్న రోజ్‌బేకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఇద్దరూ శృంగారంలో పాల్గొనాలని అనుకున్నారు. అయితే సెక్స్ సమయంలో సదరు మహిళ గుణ తిలకను కండోమ్ ధరించాలని కోరింది. కానీ, గుణ తిలక నిరాకరించడంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం గుణ తిలక మహిళ గొంతు నొక్కి కండోమ్ లేకుండానే బలవంతంగా అనుభవించాడు. దీనిపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం రాత్రి గుణతిలకను పట్టుకొని కోర్టులో హాజరుపరిచారు. కాగా, గుణ తిలక గతంలో కూడా ఇలాంటి మూడు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఒక దాంట్లో నిర్దోషిగా తేలగా, ఓ సారి ఆరు మ్యాచుల నిషేధం, ఓ సారి ఏడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అటు ఇన్ని ఆరోపణలు ఉన్న ఆటగాడిని జాతీయ జట్టులోకి ఎలా తీసుకున్నారని లంకేయులు ప్రశ్నిస్తున్నారు. తమ జట్టు లీగ్ దశలో ఇంటి ముఖం పట్టడం కన్నా లైంగిక ఆరోపణలతో క్రికెటర్ అరెస్ట్ అవడమే వారిని ఎక్కువ బాధకు గురి చేస్తోంది. దేశం కాని దేశంలో తమ పరువు తీశాడంటూ మండిపడుతున్నారు.