గుజరాత్ రాష్ట్రం వదోదర ప్రాంతానికి చెందిన క్షమాబిందు అనే యువతి విచిత్రంగా ‘తనను తాను వివాహం చేసుకోబోతున్నానని’ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. యువతి ప్రకటనతో సోషల్ మీడియాలో నెటిజన్స్ ఇలాంటి పెళ్లి చేసుకోవటం ఏంటని? తెగ చర్చించుకున్నారు. జూన్ 11వ తేదీన వడోదర గోత్రి ఆలయంలో తాను పెళ్లి చేసుకోబోతున్నానని, పెళ్లి పత్రికలు కూడా అచ్చు వేయించానని ఆ యువతి పేర్కొంది. ముహూర్తం సమయం దగ్గరపడుతుండగా, ఆ యువతికి గోత్రి ఆలయం అధికారులు గట్టిషాక్ ఇచ్చారు. ఇలాంటి పెళ్లికి తమ ఆలయంలో పర్మిషన్ లేదని తేల్చి చెప్పారు.
‘ఇలాంటి వివాహాలు సమాజాన్ని పెడదోవ పట్టిస్తాయి’ అని ఆలయ అధికారులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, ఆలయంలో ఇలాంటి పెళ్లికి అంగీకరించబోమని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న క్షమాబిందు..’ నేను ఆ గుడిలో పెళ్లి చేసుకోబోవడం లేదు’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో నెటిజన్స్ మరి క్షమాబిందు ఎక్కడ పెళ్లి చేసుకుంటుంది? అని తెగ చర్చించుకుంటున్నారు.
ఇటీవలే క్షమాబిందు..గోత్రి ఆలయంలో పెళ్లి చేసుకున్న తర్వాత, హనీమూన్ కోసం గోవా వెళ్లాలని డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. అంతేకాదు‘‘నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు. కానీ, వధువుగా మారాలని అనుకుంటున్నాను. అందుకే స్వీయ వివాహం చేసుకుంటున్నా. నేను దీనికి సంబంధించి ఆన్లైన్లో కూడా శోధించాను. దేశంలో ఏ మహిళ అయినా తనను తానే పెళ్లి చేసుకుందా? అని పరిశీలించాను. కానీ, ఎవరూ లేరని తెలిసింది. కనుక దేశంలో నాకు నేనే ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రకెక్కుతాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఆరంభంలోనే ఆమెకు గట్టిషాక్ తగలడంతో పెళ్లిని వేరేచోటకు మార్చుకుంది.