నేను ఆటో అక్కను, ఆటో అక్కను.. ఆడవాళ్ల జోలికొస్తే.. - MicTv.in - Telugu News
mictv telugu

నేను ఆటో అక్కను, ఆటో అక్కను.. ఆడవాళ్ల జోలికొస్తే..

August 13, 2019

రజనీకాంత్ ‘బాషా’ సినిమాలో పాటలా ఉంది కదా. అవును అక్కడ బాషా.. ఇక్కడ అక్క!  రాత్రి మహిళలు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్న ఈ రోజుల్లో ఓ మహిళా ఆటో డ్రైవర్ ధైర్యంగా ఆటోను నడుపుతోంది. రాత్రి వేళల్లో ప్రయాణం చేసే మహిళలను గమ్య స్థానాలకు చేర్చుతోంది. ఆఫీస్ నుంచి వచ్చే వారు ఇతర దూర ప్రాంతాల నుంచి రాత్రికి చేరుకునే వారికి ధైర్యంగా ఉంటూ వారిని కావాల్సిన ప్రాంతాల్లో దింపేస్తోంది. అంతే కాదు చిన్న పిల్లలు, వృద్ధులను డబ్బులు తీసుకోకుండా వారి గమ్య స్థానాల్లో దింపేస్తోంది. చెన్నైకి చెందిన రాజీ అక్క సాహసం, ఔదార్యం ఇది.. అక్కడ చాలా మందికి ఆమె ఆటో రాజీ అక్కగా సుపరిచితురాలు. 

ఈ ఆటో అక్క  20 ఏళ్ళుగా రోజుకు 9 గంటల పాటు ఆటోను నడుపుతూ.. మహిళలకు వంతుగా సాయం చేస్తోంది. ప్రతి రోజూ 30 రైడ్లు చేసి నెలకు 30 నుంచి 40 వేల వరకు సంపాదిస్తోంది. పురుష డ్రైవర్ల కంటే జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం విశేషం. కేరళలోని పలక్కాడ్ ప్రాంతానికి చెందిన రాజీ బీఏ ఫిలాసఫి వరకు చదివింది. ఆమె అశోక్ అనే వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లి తరువాత చైన్నైకి మకాం మార్చింది. కొంత కాలం పాటు ఉద్యోగం కోసం వెతికినా దొరకపోవడంతో తన భర్తతో పాటు తాను ఆటో నడపాలని నిర్ణయించుకుని ఆటో తోలుతోంది. 

‘మొదట్లో ఎన్నో సవాళ్లను తాను ఎదుర్కొన్నా. ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేయడం, రాత్రిపూట ఒంటరిగా డ్రైవ్ చేయడం ఇబ్బందిగా అనిపించినా తరువాత వాటన్నింటిని అధిగమించాను’ అని రాజీ చెబుతోది.  ఆమె ఇప్పటి వరకు ఎన్నో కాలేజీల్లో విద్యార్థినులకు ఆత్మస్థైర్య పాఠాలు కూడాచెప్పింది. ఈ వృత్తిలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నవారికి పాఠాలు కూడా చెబుతోంది. ఆటో డ్రైవింగ్‌లో ఎక్కువ మంది మహిళలు ఆసక్తి చూపేలా చేయడం తన లక్ష్యమని అంటోంది. రాత్రి వేళల్లో మహిళలు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకాబట్టే తాను ఈ విధంగా వారికి అండగా ఉంటున్నానని అంటోంది. ఏది ఏమైనా రాజీ లాంటి మహిళలు ఆదర్శంగా నిలిస్తే పురుషులతో పాటు మహిళా డ్రైవర్లు తయారు కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.