హైద్రాబాద్‌లో రెండ్రోజులు ఆటోలు బంద్ - MicTv.in - Telugu News
mictv telugu

హైద్రాబాద్‌లో రెండ్రోజులు ఆటోలు బంద్

March 15, 2022

నగరంలో ఈ నెల 28, 29 తేదీల్లో ఆటోలను బంద్ చేస్తున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్, క్యాబ్ యూనియన్ జేఏసీ నేతలు తెలిపారు. ఆటో డ్రైవర్లు ఆర్ధికంగా కోలుకునేందుకు చార్జీలు పెంచాలని, కొత్తగా 20 వేల సీఎన్జీ ఆటోలకు పర్మిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సోమవారం భవిష్యత్ కార్యాచరణపై యూనియన్ నేతలు సమావేశమయ్యారు. ఎనిమిదేళ్లుగా ఆటో చార్జీలు పెంచకపోవడంతో అనేక కష్టాలు పడుతున్నట్టు వెల్లడించారు. కరోనా, లాక్‌డౌన్ కారణంగా రవాణా రంగం దెబ్బ తిన్నదని, మీటర్ చార్జీలను కనీసం రూ. 40, కిలోమీటరుకు రూ. 25 చొప్పున పెంచాలని కోరారు. డ్రైవర్లు సంక్షేమ బోర్డు, ఆటో కొనుగోలుకు వడ్డీ లేని రుణాలు, ఏపీలో మాదిరి రూ. 10 వేలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఇతర జిల్లాల్లోని ఆటోలను నగరంలో తిరగకుండా శాశ్వత నిషేధం విధించాలనే డిమాండ్ల సాధనకు పోరాటం చేస్తామని వారు తెలిపారు.