‘ఆకాశ ఎయిర్’ విమాన సేవలు షురూ.. అహ్మదాబాద్‌కు తొలి ఫ్లైట్
దేశంలో కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ఆదివారం జెండా ఊపి సర్వీసుల్ని ప్రారంభించారు. తొలి విమానం ముంబయి నుంచి అహ్మదాబాద్ వెళ్లింది. ప్రముఖ స్టాక్ మార్కెట్ మదుపరి రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, ఏవియేషన్ రంగ నిపుణులు ఆదిత్య ఘోష్, వినయ్ దూబే కలిసి ఆకాశ ఎయిర్ సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ప్రారంభోత్సవం సందర్భంగా ముంబయి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఝున్‌ఝున్‌వాలా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ముంబై-అహ్మదాబాద్ మధ్య వారంలో 28 ఫ్లయిట్ సర్వీసులను ఆకాశ ఎయిర్ నడపనుంది. ఆగస్ట్ 13 నుంచి బెంగళూరు-కోచి నగరాల మధ్య సేవలను మొదలు పెట్టనుంది. వీటి బుకింగులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. www.akasaair.com వెబ్‌సైట్ లేదా ఆకాశ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఆకాశ ఎయిర్ సంస్థ గత ఏడాది బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. కమర్షియల్ సేవలకు ఆ సంస్థ ఇటీవల పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించుకుంది. దశల వారీగా విమాన సర్వీసులను విస్తరించుకుంటూ పోనుంది. కొన్ని నెలల్లో దేశంలోని మరిన్ని నగరాల మధ్య ఆకాశ ఎయిర్ సేవలు అందనున్నాయి. గతంలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, జెట్ ఎయిర్ వేస్ తదితర ఎన్నో సంస్థలు విమాన సేవలను నష్టాలతో నడపలేక మూతవేయడం తెలిసిందే.