సీబీఐ నోటీసులను తిరస్కరించిన అవినాశ్ - MicTv.in - Telugu News
mictv telugu

సీబీఐ నోటీసులను తిరస్కరించిన అవినాశ్

March 4, 2022

10

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ పంపించిన నోటీసులను అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు తిరస్కరించారు. ఇప్పటికే ఈ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.

ఈ తరుణంలో కేసులో ఇప్పటి వరకు 207 మందిని సీబీఐ అధికారులు విచారించారు. 146 మంది వాంగ్మూలాలు తీసుకున్నారు. మరోవైపు పలువురు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో, వారిని విచారించేందుకు సీబీఐ సిద్ధమైంది.

ఈ క్రమంలో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం పరిధిలోని స్పెషల్ క్రైమ్స్ మూడో విభాగం అధికారులతో పాటు మరికొందరు ముఖ్య అధికారులు గురువారం పులివెందులకు చేరుకున్నారు. సీబీఐ విచారణకు హాజరుకావాలని అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా, వాటిని తీసుకునేందుకు వారు నిరాకరించినట్టు సమాచారం.

దీంతో, కడప జిల్లా కోర్టును వారు ఆశ్రయించినట్టు తెలుస్తోంది. కోర్టు అనుమతితో శుక్రవారం మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.