తెలుగు తెర‌పై స‌రికొత్త ప్ర‌య‌త్న‌ం - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు తెర‌పై స‌రికొత్త ప్ర‌య‌త్న‌ం

February 16, 2018

ఓ యువ‌తి మ‌నో ప్ర‌పంచంలో నుంచి పుట్టిన క‌థే ‘అ!’.  చిన్న‌నాటి నుంచి తాను ఎదుర్కొన్న లైంగిక వివ‌క్ష‌, త‌ల్లిదండ్రులు దూర‌మ‌వ్వ‌డంతో ఆమె ప‌డిన సంఘ‌ర్ష‌ణ, జీవితంలో స్థిర‌ప‌డ‌టానికి చేసిన ప్ర‌య‌త్నాల్ని తన‌దైన ఊహ ప్ర‌పంచం ద్వారా ఎలా ఆవిష్క‌రించింద‌న్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం. టైటిల్‌కు త‌గిన‌ట్లుగానే క‌థ‌, క‌థ‌నాలు, పాత్ర‌చిత్ర‌ణలు ప్ర‌తీదా వైవిధ్యంగా సాగుతాయి.  న‌వ్య‌మైన ఆలోచ‌న‌లో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్‌వ‌ర్మ సిద్ధం చేసిన ఈ క‌థ‌ను హీరో నాని నిర్మాత‌గా మారి ప్రాణం పోశాడు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే సాహ‌స‌మే చేశాడు.

కాళీ(కాజ‌ల్ అగ‌ర్వాల్‌) జీవితంలో అన్నింటిలో ఓటమి పాల‌వ్వ‌డంతో త‌న పుట్టిన రోజునాడే ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. ఒంట‌రిగా పుట్టిన‌రోజును జ‌రుపుకుని ఆ త‌ర్వాత చ‌నిపోవాల‌ని ఓ ఫుడ్‌కోర్టులోకి అడుగుపెడుతుంది.  ఈ క్ర‌మంలో అదే ఫుడ్ కోర్టులో త‌న క‌ళ్ల ఎదుట క‌నిపించిన వ్య‌క్తుల‌ను  ఊహ‌ప్ర‌పంచంలోకి ఆహ్వానిస్తూ వారి ద్వారా త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల్ని గుర్తుకుతెచ్చుకుంటుంది.రాధా(ఇషా) చిన్న‌నాటి నుంచి మ‌గాళ్లంటే అస‌హ్యం. అంద‌రూ త‌న ప‌ట్ట అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డంలో కృష్ణ‌(నిత్యామీన‌న్‌) అనే అమ్మాయిని ప్రేమిస్తుంది. ఆమెతోనే త‌న జీవితం అనుకుంటుంది. కానీ వారి ప్రేమ‌ను రాధా త‌ల్లిదండ్రులు హ‌ర్షించ‌రు. న‌ల‌భీమ(ప్రియ‌ద‌ర్శి) ఓ నిరుద్యోగి. ఉద్యోగం కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసి చివ‌ర‌కు ఫుడ్‌కోర్టులో వంట‌వాడిగా చేర‌తాడు. కానీ అత‌డికి వంట‌రాదు. అక్క‌డే అక్వేరియంలో ఉన్న చేప అత‌డికి వంట‌లు చేయ‌డంలో స‌హాయం చేస్తుంటుంది. కానీ చివ‌ర‌కు ఆ చేప‌నే చంపేయాల్సిన ప‌రిస్థితి అత‌డికి ఎదుర‌వుతుంది. కానీ త‌న మ‌న‌సు అందుకు అంగీక‌రించ‌దు. చివ‌ర‌కు అత‌డు ఏం చేశాడ‌న్న‌ది ఓ క‌థ‌. అక్క‌డే అక్వేరియంలో  నాని అనే చేప ఉంటుంది. ఎప్ప‌టికైనా స‌ముద్రంలో స్వేచ్ఛ‌జీవిగా విహ‌రించాల‌న్న‌ది త‌న క‌ల‌. చంటి(ర‌వితేజ‌) అనే చెట్టుతో నాని నిరంతం ఘ‌ర్ష‌ణ ప‌డుతుంటాడు. కానీ మ‌న‌సులో మాత్రం ఒక‌రంటే మ‌రొక‌రికి ప్రాణం. చివ‌ర‌కు నాని చ‌నిపోయే ప‌రిస్థితి వ‌స్తుంది. నాని చావును చంటి ఎలా అడ్డుకున్నాడ‌న్న‌దే మ‌రో క‌థ‌.

యోగి (ముర‌ళీశ‌ర్మ‌) ఓ పెద్ద ఇంద్ర‌జాలికుడు. ప్ర‌పంచంలోనే తానే అంద‌రిక‌న్నా గొప్ప మెజీషియన్ అనే గ‌ర్వం ఎక్కువ‌. దేవుడు అత‌డికి చివ‌ర‌కు బుద్ధిచెబుతాడు. ఆ భ్ర‌మలో నుంచి బ‌య‌ట‌ప‌డేలా చేస్తాడు. మీరా(రెజీనా ) డ్ర‌గ్ అడిక్ట్‌. త‌న ప్రియుడితో క‌లిసి దొంగ‌త‌నం చేసి డ‌బ్బు సంపాదించాల‌ని అనుకుంటుంది. కానీ మ‌త్తుకు బానిస కావ‌డంలో  నిరంత‌రం  వింత ప్ర‌పంచంలో విహ‌రిస్తుంటుంది.  శివ(అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌) చిన్న‌త‌నంలోనే త‌ల్లిదండ్రుల‌కు దూరం అవుతాడు. ఫుడ్‌కోర్టు వాచ్‌మెన్‌గా ప‌నిచేస్తుంటాడు. ఓ టైమ్‌మిష‌న్‌ను క‌నిపెట్టి త‌న త‌ల్లిదండ్రుల‌ను బ‌తికించుకోవాల‌న్న‌ది అత‌డి కోరిక‌. కానీ అది ఆసాధ్యమని అత‌డికి తెలుస్తుంది.  ఇలా ఓ యువ‌తి ఊహల్లో నుంచి పుట్టిన పాత్ర‌లు త‌న మ‌ర‌ణంలో ఎలా క‌నుమ‌రుగైపోయాయ‌న్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం.

ల్టీపుల్ ప‌ర్స‌నాలిటీ డిజార్డర్  అనే మాన‌సిక వ్యాధితో భాప‌డుతున్న ఓ యువ‌తి  జీవితాన్ని, ఆమె ఎదుర్కొన్న అంత‌స్సంఘ‌ర్ష‌ణ‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్‌వ‌ర్మ తెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. హార‌ర్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, ఫాంట‌సీ, ల‌వ్ ఇలా భిన్న అంశాల‌తో స్క్రీన్‌ప్లే ప్ర‌ధానంగా సినిమాను న‌డిపించారు.  ఒక్కో పాత్ర‌ను ముడిపెడుతూ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సినిమా సాగుతుంది.. ప్ర‌థ‌మార్ధం పాత్ర‌ల ప‌రిచ‌యాల‌తో న‌డిపించిన ద‌ర్శ‌కుడు ద్వితీయార్థంలో వాటికో ముగింపును ఇచ్చారు. వాటిలో కొన్నింటిలో స‌ఫ‌ల‌మైన ద‌ర్శ‌కుడు మిగ‌తా వాటిలో మాత్రం కొంత త‌డ‌బ‌డ్డాడు. ఎక్కువ పాత్ర‌ల‌తో క‌థను చెప్పాల‌నుకోవ‌డం కూడా మైన‌స్‌గా మారింది. తెర‌పై చాలా పాత్ర‌లు క‌నిపిస్తుండ‌టంతో ప్రేక్ష‌కుడు అయోమ‌యానికి గుర‌వుతాడు. కేవ‌లం పాత్ర‌ల ప‌రిచ‌యాల‌కే ప్ర‌థ‌మార్ధం కేటాయించారు. దాంతో మిగిలిన కొద్ది స‌మ‌యంలో పూర్తి క‌థ‌ను చెప్పే ప్ర‌య‌త్నంలో  గంద‌ర‌గోళానికి లోనైన భావ‌న క‌లుగుతుంది. ప‌తాక ఘ‌ట్టాల్లో ఏం  జ‌రుగుతుందో కొన్ని సార్లు అంతుప‌ట్టదు. హాడావిగా ముగించిన భావ‌న క‌లుగుతుంది.

చిన్న చిన్న లోపాలు మిన‌హాయిస్తే తెలుగు తెర‌పై ఇదొక వినూత్న ప్ర‌య‌త్నంగా చెప్ప‌వ‌చ్చు. తొలి సినిమా అనే భావ‌న ప్ర‌శాంత్‌లో ఎక్క‌డా  క‌నిపించ లేదు.. చాలా ప‌క‌డ్బందీగా క‌థ‌, క‌థ‌నాల్ని అల్లుకున్నారు.  రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ పంథాకు భిన్నంగా కొత్త సెట‌ప్‌తో న‌టీన‌టుల్ని చూపించ‌డం ఆక‌ట్టుకుంటుంది. భిన్న జోన‌ర్ క‌థ‌ను ఆద్యంతం స‌ర‌దాగా న‌డిపించారు. ప్రియ‌ద‌ర్శితో చేప‌, చెట్టు కాంబినేష‌న్‌లో వ‌చ్చే స‌న్నివేశాలు, ముర‌ళీశ‌ర్మ ఎదుర్కొనే ఇబ్బందులు న‌వ్విస్తాయి.

ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌ల్ని, క‌థ‌లోని కొత్త‌ద‌నాన్ని న‌మ్మి లాభ‌న‌ష్టాల గురించి ఆలోచించ‌కుండా హీరో నాని నిజాయితీగా చేసిన ప్ర‌య‌త్న‌మిది. అత‌డి ధైర్యానికి హ్యాట్స‌ఫ్ చెప్ప‌కుండా ఉండ‌లేం.  నిర్మాత‌గా ఈ సినిమాకు పూర్తిగా న్యాయం చేయ‌డానికి ఆయ‌న ప‌డిన త‌ప‌న తెర‌పై క‌నిపిస్తుంది.

కాజ‌ల్ అగ‌ర్వాల్‌, రెజీనా, నిత్యామీన‌న్‌, ప్రియ‌ద‌ర్శి, ఇషా, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ప్ర‌తి ఒక్క‌రూ త‌మ న‌ట‌న‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌నిపించ‌న‌టువంటి కొత్త  పాత్ర‌ల్లో చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచారు. మ‌త్తు ప‌దార్థాల‌కు బానిస‌గా మారిన యువ‌తిగా నిత్యామీన‌న్ ఆహార్యం,న‌ట‌న వినూత్నంగా సాగుతాయి. ఒంటినిండా ట‌టూల‌తో మంచీచెడుల మ‌ధ్య న‌లిగిపోయే యువ‌తిగా త‌న పాత్ర‌లో ఒదిగిపోయింది. స్వ‌లింగ‌సంప‌ర్కులుగా నిత్యామీన‌న్‌, ఇషా పాత్ర‌లు వారి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు న‌వ్విస్తూ ఆలోచింప‌జేస్తాయి. వంట‌లు చేయ‌డం రాని చెఫ్‌గా ప్రియ‌ద‌ర్శి ప‌డే తంటాలు వినోదాత్మ‌కంగా సాగుతాయి. చేప‌(నాని వాయిస్ ఓవ‌ర్‌), చెట్టు(ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్‌)ల‌ను క‌థ‌లో మిళితం చేస్తూ ప్రియ‌ద‌ర్శి వాటితో జ‌రిపే సంభాష‌ణ‌ల్లో క‌థ‌ను చెబుతూనే ప్ర‌పంచానికి చెట్టు అవ‌స‌ర‌మ‌నే చ‌క్క‌టి సందేశాన్నిఇచ్చా ద‌ర్శ‌కుడు. మెజీషియ‌న్‌గా ముర‌ళీశ‌ర్మ‌, త‌ల్లిదండ్రుల‌ను బ‌తికించుకోవాల‌నే ఆరాట‌ప‌డే యువ‌కుడిగా అవ‌స‌రాల శ్రీ‌నివాస్ పాత్ర‌లు కొత్త పంథాలో సాగాయి.

కార్తీక్ ఘ‌ట్ట‌మనేని ఛాయాగ్ర‌హ‌ణం, మార్క్ కె  రాబిన్ నేప‌థ్య సంగీతం సినిమాకు ఆయువుప‌ట్టుగా నిలిచాయి. త‌క్కువ లైటింగ్‌తో ప్ర‌తి స‌న్నివేశాన్ని వైవిధ్యంగా తెర‌పై చూపించారు కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని.

తెలుగు తెర‌పై ఇప్ప‌టివ‌ర‌కు చేయని స‌రికొత్త ప్ర‌య‌త్న‌మిది. క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల గురించి ఆలోచించ‌కుండా  న‌వ్య‌త‌ను న‌మ్మి నాని బృందం చేసిన వైవిధ్య‌ప్ర‌య‌త్న‌మిది. పూర్తిగా మ‌ల్టీప్లెక్స్ ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు అనుగుణంగానే సినిమా సాగుతుంది. బీ, సీ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకోవ‌డం కొంత‌వ‌ర‌కు క‌ష్ట‌మే. ఏది ఏమైనా మంచి ప్ర‌య‌త్నంగా మాత్రం నిలిచిపోతుంది..

రేటింగ్‌:3/5